స్టార్‌ వార్‌.. నేడు జిల్లాకు కేసీఆర్‌, మోదీ రాక

STAR WAR .. KCR to the District today, Modi's Arrival - Sakshi

నేడు జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌

పాలమూరుకు రెండోసారి వస్తున్న ప్రధాని 

28న కోస్గికి రానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

29న జిల్లాలో బీఎస్‌పీ అధినేత్రి మాయవతి సభ 

జాతీయ నేతల రాకతో 24గంటల పాటు పోలీసుల డేగకన్ను  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీలకు చెందిన అతిరథ నేతలు పాలమూరుకు క్యూ కట్టారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం కోసం ముఖ్యనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో వీఐపీల తాకిడి ఉండనుంది. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం కోసం స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలమూరుకు వస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం 12.30గంటలకు మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం మంగళవారం ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆమన్‌గల్, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేటల్లో ఏ ర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పా ల్గొంటారు.

అదే విధంగా ఈనెల 28న ఏఐసీసీ అ ధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొడంగల్‌ నియోజకవర్గం లోని కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక బీఎస్‌పీ అధినేత్రి మాయవతి కూడా ఈనెల 29న మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా మొత్తం మీద జాతీయ స్థాయి నేతలు ఉమ్మడి జిల్లా పర్యటనలు చేస్తుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. కేంద్ర బలగాల సౌజన్యంతో 24గంటల పాటు డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు.  

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ 
శాసనసభ ఎన్నికలను ఈ సారి అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకుంటామనే ధీమాతో సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పలు సర్వేల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విజయం సాధించేందుకు ఎప్పటికప్పుడు వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌... పాలమూరులో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇది వరకే నాలుగు చోట్ల జడ్చర్ల, దేవర కద్ర, నారాయణపేట, షాద్‌నగర్‌లలో ప్రజా ఆశీర్వాద సభలను పూర్తి చేశారు. తాజాగా మంగళవారం మరో అయిదు చోట్ల బహిరంగ సభలను నిర్వహించనున్నారు. కల్వకుర్తిలోని ఆమన్‌గల్, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరు కానున్నారు. వీటితో వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలలో కూడా పాల్గొననున్నారు. అంతేకాదు ఎక్కడిక్కడ స్థానిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇలా మొత్తం సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలతో పార్టీ కేడర్‌లో జోష్‌ పెంచుతున్నారు.  

మోదీ రాకతో కమలంలో కొత్త ఆశలు 
ఈసారి ఎలాగైనా పాలమూరు ప్రాంతం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని బీజేపీ అధిష్టానం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా పాలమూరు నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఉమ్మడి జిల్లాలో గతంలో కొన్ని స్థానాలు గెలిచిన చరిత్ర ఉండటంతో... బీజేపీ ఈసారి ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. అందుకు అనుగుణంగా కొన్ని స్థానాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉమ్మడి జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని ధీమాగా ఉంది. అయితే ఇప్పటికే అమిత్‌ షా ఎన్నికల శంఖారావం పూరించగా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రాకతో ఒక్కసారిగా అంచనాలు పెరుగుతున్నాయి. నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో కమల దళంలో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ రాకతో బీజేపీలో ఓటు బ్యాంకింగ్‌ భారీగా పెరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తా

జాగా ముక్కొణపు పోటీలో భాగంగా మోదీ, అమిత్‌షా విస్తృత పర్యటనలతో ఫలితాలు సాధించొచ్చని భావిస్తోంది. అలాగే డిసెంబర్‌ 2న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన్‌గల్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.  

రాహుల్‌తో పాటు ‘బాబు’ వచ్చేనా? 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనకు చెక్‌ పెట్టాలని చెబు తూ కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి పోటీకి దిగుతోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని రం గంలోకి దింపారు.ముఖ్యంగా పాలమూరు ప్రాం తంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందనే సంకేతాలతో కేడర్‌లో మరింత జోష్‌ పెంచేందుకు జిల్లాకు రాహుల్‌గాంధీ వస్తున్నారు. ఈనెల 28న కొడంగ ల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేసిన బ హిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

అయితే, ప్రజాకూటమిలో భాగమైన  టీడీపీ అధినేత చం ద్రబాబు కూడా కోస్గి ప్రచార సభకు హాజరవుతా రని ప్రచారం జరుగుతోంది.ఈ విషయంలో కాం గ్రెస్‌ వర్గాలు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. పైగా పాలమూరు జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ అ భ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు రాక విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతీ సభ లోనూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తుండడంతో ఆయన వస్తారా, రారా అన్నది తేలాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top