ఉసురు తీసిన ‘మూడెకరాలు’

Srinivas died while attempting to commit suicide

దళితులకు మూడెకరాల పంపిణీ జాబితాలో పేరు లేదని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌ మృతి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూరులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహంకాళి శ్రీనివాస్‌ (26) మృతి చెందాడు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ విషయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవ శ్రీనివాస్‌రెడ్డి తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, పరుశురాములు ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

వీరిద్దరినీ మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశాడు. పోలీసు బందోబస్తు మధ్య శ్రీనివాస్‌ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పొస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాన్ని శ్రీనివాస్‌ స్వగృçహానికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన మరో వ్యక్తి పరుశురాములును సోమవారం డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
శ్రీనివాస్‌ కుటుంబాన్ని 

ఆదుకుంటాం: రసమయి
శ్రీనివాస్‌ మృతి బాధాకరమని, రక్త సంబంధీ కుడిని కోల్పోయానని ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ మృతి విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికి వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ... అతడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, అండగా ఉంటుందని రసమయి బాలకిషన్‌ హామీ ఇచ్చారు.

ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
బెజ్జంకి(సిద్దిపేట): సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో శ్రీనివాస్‌ అంత్యక్రియ లు ఉద్రిక్తతల మధ్య పూర్తయ్యాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు డిమాండ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ఆహార కమిటీ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ వారితో మాట్లాడారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 3 ఎకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన హామీనిచ్చారు. దీంతో శ్రీనివాస్‌ అంత్యక్రియలకు ఒప్పుకు న్నారు. శ్రీనివాస్‌కు భార్య శ్రావణి, కుమారులు మణిదీప్‌ (3), శశాంక్‌ (2) ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top