
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు కూలిపోయిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. నాలుగు జాతీయ రహదారులు సహా 1,337 రోడ్లు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోలన్ జిల్లాలోని సామ్లో గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో ఒక మహిళ మృతిచెందింది. మృతురాలిని హేమలతగా గుర్తించారు. ప్రమాదంలో ఆమె భర్త హీమ్ రామ్, నలుగురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కులులోని ధల్పూర్‌లో వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో శిథిలాల నుంచి ఒక పురుషుడు, ఒక మహిళను సహాయక సిబ్బంది రక్షించారు. ఆ మహిళ తరువాత మృతిచెందింది. మండి జిల్లాలోని సుందర్‌నగర్‌లోని జంగం బాగ్ బీబీఎంబీ కాలనీ సమీపంలో కొండచరియలు విరిగిపడి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది.