
చండీగఢ్: ఎవరైనా వ్యక్తి జీవించి ఉండగానే అతని ధృవీకరణ పత్రంలో మరణించి ఉన్నట్లు పేర్కొంటే ఏమి జరుగుతుంది? అతను ఎన్ని అవస్థలు పడతాడు? తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు? సరిగ్గా ఇటువంటి అనుభవమే హర్యానాలోని రోహ్తక్ ప్రజారోగ్యశాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఎదురయ్యింది. ఈ నేపధ్యంలో అతని సమస్యను హర్యానా మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది.
హర్యానాలోని రోహ్తక్ ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్నఒక ఉద్యోగికి కోవిడ్ అనంతర కాలంలో.. అతని జీతాన్ని నిలిపివేయడాన్ని హర్యానా మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అతను తన కార్యాలయ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, అతని జీతం నిలిపివేయడాన్ని తప్పుపట్టింది. దీనికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాని కారణమని పేర్కొంది. అతని ఆధార్‌లో మరణించాడు అని తప్పుగా ముద్రితమై ఉండటాన్ని గమనించినప్పటికీ, ప్రజారోగ్యశాఖ అధికారులు హెచ్‌కేఆర్‌ఎన్ పోర్టల్‌లో ఆ ఉద్యోగి స్థితిని అప్‌డేట్ చేయడంతో విఫలమయ్యారని హక్కుల కమిషన్ పేర్కొంది.
ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిర్యాదుదారు దీర్ఘకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, మానసిక వేదనను అనుభవిస్తున్నాడని హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. చైర్‌పర్సన్ జస్టిస్ లలిత్ బాత్రా, సభ్యులు కుల్దీప్ జైన్, దీప్ భాటియాలతో కూడిన ధర్మాసనం.. ఈ ఘటన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక (ఐసీఈఎస్‌సీఆర్)లోని ఆర్టికల్ 7 కు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. ఈ ఆర్టికల్ కార్మికులు, వారి కుటుంబాల న్యాయపరమైన హక్కును గుర్తిస్తుంది.
పరిపాలనా అధికారుల నిర్లక్ష్యంపై ఆధారాలు లభించిన నేపధ్యంలో కమిషన్ ఆ ఉద్యోగి జీతం పునరుద్ధరించేందుకు, అతనికి సంబంధించిన అన్ని రికార్డులను సరిచేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది. ఈ కేసులో సెప్టెంబర్ 23న జరగబోయే తదుపరి విచారణకు ముందుగానే ఫిర్యాదుదారుని సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదికను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.