మనకూ ‘ముంబై’ ముప్పు

Special Story on Old Buildings in Hyderabad - Sakshi

భయపెడుతున్న భవనాలు

శిథిల, పురాతన కట్టడాల

కూల్చివేతపై అధికారుల నిర్లక్ష్యం

వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

సాక్షి, సిటీబ్యూరో: ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో పురాతన భవనం కూలి పలువురు మృతి చెందిన నేపథ్యంలో నగరంలోని శిథిల, పురాతన భవనాలపై చర్చ జరుగుతోంది. నగరంలోనూ ఏటా వర్షాకాలంలో భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలానికి ముందస్తుగా శిథిలభవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్న అధికారులు వాటికి సంబంధించి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 167 శిథిల భవనాలను కూల్చడంతో పాటు 132 భవనాలకు మరమ్మతులు చేయించడం, వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేశామంటున్న అధికారులు మరికొన్నింటిని సీజ్‌ చేసినట్లు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల లెక్కల మేరకు నగరంలో ఇంకా 466 శిథిల భవనాలు ఉన్నాయి. లెక్కలోకి రాని భవనాలు ఇంకా ఎక్కువే ఉంటాయని అంచనా. నగరంలో భారీ వర్షాలు ప్రారంభం కాలేదు. నగరంలో ఏటా జూలైనుంచి సెప్టెంబర్‌ మధ్యే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనాల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.  ముంబైలోనూ వాహనాలు వెళ్లేందుకు అవకాశం ని ప్రాంతంలో భవనం కూలింది. నగరంలోనూ పలు ప్రాంతాల్లో అదే పరిస్థితి.  ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే ఐదంతుస్తులు నిర్మించిన భవనాలు నగరంలో చాలా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగం అనుమతుల జారీలో జాప్యం కూడా ముంబై ఘటనకు కారణంగా ఆరోపణలు వెలువెడుతున్నాయి. ఆ ప్రాంతంలోని పాత భవనాలకు మరమ్మతులు చేయించుకునేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు జాప్యం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలోనూ టౌన్‌ప్లానింగ్‌ పనితీరుపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో  చొర వ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిథిల భవనాల కూల్చివేతల్లోనూ కొందరు  యజమానులతో కుమ్మక్కై వాటి జోలికి పోవడం లేదనే ఆరోపణలున్నాయి.   ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.   లేని పక్షంలో ముంబై తరహా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.  

2016లో కూల్చివేసిన శిథిల భవనాలు : 485
2017లో కూల్చివేసిన శిథిల భవనాలు : 294

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top