విలీనం.. అగమ్యగోచరం

Some Villages In Telangana May Have No Gram Panchayat Elections - Sakshi

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా పంచాయతీరాజ్‌ విభాగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఓటరు జాబితా మొదలుకుని, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ వరకు కీలక ఘట్టాలన్నీ ఒక్కటొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే గతంలో మేజర్‌ పంచాయతీలుగా వెలుగొందిన గ్రామ పంచాయతీలు త్వరలో మున్సిపాలిటీలుగా మారనున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపించడం లేదు. మరోవైపు మేజర్‌ పంచాయతీలు కేంద్రంగా చక్రం తిప్పిన నాయకులు, కొత్తగా మున్సిపాలిటీల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు.                     –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ మున్సిపాలిటీలుగా, గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్, అందోలు–జోగిపేట నగర పంచాయతీలుగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ నగర పంచాయతీ కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చి చేరింది. దుబ్బాకను 2013లో నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా, కోర్టు కేసుల మూలంగా పాలక మండలి ఎన్నిక జరగలేదు. చేగుంటను నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో ఆరేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న మున్సిపాలిటీల పరిధిని విస్తరించడంతో పాటు నగర పంచాయతీలకు కూడా మున్సిపాలిటీ హోదా కల్పించింది.

మరోవైపు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. మెదక్‌ జిల్లా పరిధిలో కొత్తగా రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్, సిద్దిపేట జిల్లాలో చేర్యాలకు మున్సిపల్‌ హోదా దక్కింది. జనాభా, ఆదాయం పరంగా మేజర్‌ పంచాయతీలుగా ఉన్న గ్రామాలన్నీ దాదాపు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. మేజర్‌ పంచాయతీలకు సమీపంలో ఉన్న 30కి పైగా  పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. అంతటా ఎన్నికల సందడి కనిపిస్తున్నా, మున్సిపాలిటీలో విలీనమై, కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన పంచాయతీల్లో స్తబ్ధత నెలకొంది.

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత
కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో రామాయంపేట, నర్సాపూర్, నారాయణఖేడ్, చేర్యాల నియోజకవర్గ, తాలూకా, మండల కేంద్రాలుగా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్‌ మండలం గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, జిల్లాల పునర్విభజనలో రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా మారింది. వీటితో పాటు రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మేజర్‌ పంచాయతీలు అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్‌ గ్రామ పంచాయతీలు వేగంగా పట్టణీకరణ చెందడంతో..

ఇక్కడ సర్పంచ్‌ పదవికి ఎక్కడా లేని క్రేజ్‌ ఏర్పడింది. గతంలో మేజర్‌ పంచాయతీలుగా వెలుగొందిన ఉస్మాన్‌నగర్, వెలిమెల, కొల్లూరు తదితర గ్రామ పంచాయతీలు తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన పోతిరెడ్డిపల్లి  ప్రస్తుతం పన్నుల రాబడిలో జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. పత్యేకత కలిగిన మేజర్‌ పంచాయతీలన్నీ మున్సిపాలిటీలుగా అవతరించడంతో పంచాయతీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. 

భవితవ్యంపై కొత్త లెక్కలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు శివారులో ఉన్న అమీన్‌పూర్‌ పంచాయతీ ఎన్నికల తంతు అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో సాగేది. అమీన్‌పూర్‌ సర్పంచ్‌లుగా పనిచేసిన నాయకులు ప్రస్తుతం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవులను ఆశించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ సర్పంచ్‌ శశికళ యాదవరెడ్డి, ప్రస్తుత సర్పంచ్‌ కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. తెల్లాపూర్‌ సర్పంచ్‌ మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బొల్లారం కేంద్రంగా పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొలన్‌ బాల్‌రెడ్డి భార్య సర్పంచ్‌గా, సోదరుడు రవీందర్‌రెడ్డి జిన్నారం ఎంపీపీగా ఉన్నారు.

నర్సాపూర్‌ మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీ యాదవ్‌ తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మేజర్‌ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో విలీన ప్రతిపాదిత గ్రామాలకు చెందిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వచ్చే ఏడాది జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా అవతారం ఎత్తేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన తమ ప్రాంతంపై పట్టు నిలుపుకొంటూనే రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్నారు. గ్రామ పంచాయతీ రాజకీయాలపై ఆశ చావని ఔత్సాహికులు కొందరు.. తమకు అనుకూలమున్న పంచాయతీల్లో ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top