అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్‌

SK Joshi Comments About Summer needs - Sakshi

వేసవి చర్యలపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీకి తెలిపిన జోషి

సాక్షి, హైదరాబాద్‌: ఈ వేసవిలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌ కుమార్‌ సిన్హాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సచివాలయంలో ప్రదీప్‌ కుమార్‌ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరువు కార్యాచరణ ప్రణాళిక అమలు, భూగర్భజలాలు, విద్యుత్‌ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటాసేకరణ, విశ్లేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్‌లో అధిక నిధులు ఇరిగేషన్‌ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు.

మిషన్‌ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామని, రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని, ప్రధాన రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, వడగాడ్పులపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కర్ణాటక రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినందుకు సీఎస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top