సమగ్ర కుటుంబ సర్వే కోసం ఈనెల 19న జిల్లాలోని ప్రజలంతా ఇళ్లలో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు.
మేడ్చల్: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఈనెల 19న జిల్లాలోని ప్రజలంతా ఇళ్లలో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ యజమానితో పాటు, కుటుంబసభ్యులు ఇంట్లో ఉండి సర్వే కోసం వచ్చే అధికారులకు సహకరించాలని సూచించారు.
హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, సర్వే విధుల్లో ఉన్నవారు, అత్యవసర కేసుల్లో ఆస్పత్రుల్లో ఉన్న వారు, ఇతర ప్రాంతాల్లో చదువుల కోసం వెళ్లినవారు మినహా అందరూ ఇళ్లకు చేరుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీఓలు.. మండల స్థాయి, పట్టణప్రాంతాల్లో కమిషనర్లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌తో పాటు, సెక్టోరియల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రతీ 30 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సర్వేలో 80 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, 20 శాతం ప్రైవేటు ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. బుధవారం నాటికి వారికి శిక్షణ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నోడల్, సెక్టోరియల్, ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను ముందుగానే సందర్శించి ఇళ్లకు నంబర్లు కేటాయించారా లేదా, విభజన ఎలా చేశారు, సంచార కుటుంబాలు, అనాథాశ్రమాలు ఎమైనా ఉన్నాయా లాంటి వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు 19న గ్రామాలకు చేరకముందే అందించాలన్నారు. సర్వే విధుల్లో ఉన్న ఉద్యోగులు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 6 గంటల లోపు చేరుకోవాలన్నారు.
అక్కడే అల్పాహారం ముగి ంచుకుని 8 గంటల లోపు సామగ్రితో గ్రామాలకు వెళ్లి సర్వేను ప్రారంభించాలన్నారు. సర్వే పూర్తయ్యాక పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేసి అక్కడే భోజనం చేసి వెళ్లాలన్నారు. సర్వే ఫార్మెట్‌ను ముందుగానే ఎన్యూమరేటర్లకు ఇచ్చి రెండు మూడుసార్లు చదువుకునేలా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్‌రావు, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ శోభ, మండల ప్రత్యేకాధికారి ఉమ తదితరులు పాల్గొన్నారు.