
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడి పదవులను వేలం వేస్తున్న ఘటనల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తీవ్రంగా స్పందించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 211(1) ప్రకారం ఎన్నికల్లో సర్పంచ్, వార్డు పదవులను వేలం వేయడం అక్రమమని స్పష్టంచేసింది. ఐపీసీలో ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సెక్షన్లు 171(బీ), 171(ఈ) ప్రకారం శిక్షార్హమని హెచ్చరించింది. నేరారోపణలు రుజువైతే ఏడాది జైలు శిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఆరోపణలు రుజువైతే పదవులకు ఎన్నికైన ప్రతినిధులపై అనర్హత వేటు పడుతుందని తెలిపింది. లంచాల పంపిణీ, అనైతికంగా ప్రభావితం చేసి ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహిస్తే సదరు ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేసింది.
వేలంతో నిరంకుశత్వం..
రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా, పలు ప్రాంతాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసేందుకు డబ్బులు వసూలు/డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. పదవుల వేలంలో పాల్గొన్న వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పదవులకు వేలం నిర్వహిస్తే తమకు నచ్చిన అభ్యర్థులకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును ఓటర్లు కోల్పోతారని అభిప్రాయపడ్డారు. ప్రజలందరిపై కొద్దిమంది నిరంకుశత్వం చెలాయించడానికి అవకాశమిచ్చినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవుల వేలానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పత్రికలు, న్యూస్ చానళ్లలో వచ్చే వార్తలపై దర్యాప్తు జరిపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పదవుల వేలంలో పాల్గొనే వ్యక్తులపై సరైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినట్లు వచ్చే సమాచారం ఆధారంగా విచారణ జరిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోపాటు సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని సూచించారు. సాధారణ పరిశీలకుడి నుంచి అనుమతి పొందిన తర్వాతే ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించాలని కోరారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన చోట్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్వీయ సంతృప్తి పొందిన తర్వాతే సాధారణ పరిశీలకులు ఫలితాల ప్రకటనకు అనుమతించాలన్నారు.