రోజువారీ ప్రచార లెక్కలు చెప్పాల్సిందే! 

SEC mandate for candidates contesting in panchayat elections - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎస్‌ఈసీ ఆదేశం 

వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యత ఎంపీడీఓలదే 

ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోపు పూర్తి వివరాలు వెల్లడించాలి.. లేదంటే అనర్హత వేటు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారి ప్రచార ఖర్చు లెక్కలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆ ఖర్చుల వివరాలను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)కు సమర్పించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏదైన ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అప్పగించింది. ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ మేరకు ఆయా అంశాలను చేర్చింది.  

ఎవరడిగినా వివరాలు చెప్పాలి.. 
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను గ్రామాల్లోని ఓటర్లు లేదా సాధారణ ప్రజలు లేదా మీడియా ప్రతినిధులు ఎవరడిగినా ఉచితంగా ఇవ్వాలని సూచించింది. ఇలా చేయడం వల్ల అభ్యర్థుల ప్రచార ఖర్చు వివరాలు తెలియడంతో పాటు, పెరిగే ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసే వివరాలు తెలుసుకునేందుకు ఒక్కో మండలంలో ఐదారు బృందాలను ఈసీ ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు ప్రచార ఖర్చుల పూర్తి వివరాలను సమర్పించని అభ్యర్థులను కొన్నేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించే అవకాశం ఉంది. గతంలో ఈ వివరాలు సమర్పించని 12 వేల మందిపై మళ్లీ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినట్టు ఎస్‌ఈసీ గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

పెరిగిన అభ్యర్థుల వ్యయం.. 
1995లో ఖరారు చేసిన ఎన్నికల వ్యయాన్ని ఇప్పుడు పెంచారు. గతంలో 10 వేల జనాభా పైబడిన పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.80 వేల వ్యయ పరిమితి, 10 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.40 వేల పరిమితి ఉండేది. ప్రస్తుతం నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వ్యయ పరిమితిని 5 వేల జనాభా దాటిన గ్రామాల సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.2.5 లక్షలు, 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.1.5 లక్షల పరిమితి విధించారు. 5 వేలు పైబడిన జనాభా ఉన్న పంచాయతీల్లోని వార్డు సభ్యుల అభ్యర్థులకు రూ.50 వేలు, 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లోని వార్డు సభ్యుల అభ్యర్థులకు రూ.30 వేల వ్యయ పరిమితిని ఈసీ ఖరారు చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top