కొత్తమార్గంలో బియ్యం దందా!

Scams In Ration Shops Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో రేషన్‌బియ్యం దందా దారి మళ్లింది. రేషన్‌ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం మార్చి నెల నుంచి ఈ–పాస్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. అయినా ఈ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో రేషన్‌షాపుల నుంచే బియ్యాన్ని దారి మళ్లించగా, ఇప్పుడు వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి రీసైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తుండటంతో రేషన్‌ బియ్యం పోలీసులకు తరుచూ పట్టుబడుతున్నాయి.

గ్రామాల్లో సేకరణ
గ్రామాల్లో కొందరు లబ్ధిదారులు దొడ్డుగా ఉన్న రేషన్‌ బియ్యం తినలేక చిన్న వ్యాపారులకు కిలోకు రూ.6 నుంచి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో బియ్యం దందా చేసే పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో మహారాష్ట్ర, హైదరాబాద్‌ పరిసరాల్లోని కోళ్లఫారాలకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లకు కిలోకు రూ.22కు విక్రయిస్తున్నారు. అంటే దళారులు కిలోకు రూ.16 నుంచి రూ.12 వరకు లాభం పొందుతున్నారు. అయితే గ్రామాల్లో నుంచి మిలర్ల వద్దకు తరలించేందుకు వ్యాపారులు కొత్త మార్గాలనే అనుసరిస్తున్నారు. ఈ దందాలో రోజువారీ కూలీల నుంచి బడా వ్యాపారుల వరకు ఉన్నారు. రెండు మూడు క్వింటాళ్లు సేకరించి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్‌ బియ్యం అనేది గుర్తుపట్టకుండా బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి రవాణా చేస్తున్నారు.

లాభసాటి వ్యాపారం
రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అమ్మడం అక్రమార్కులకు లాభసాటి వ్యాపారంగా మారింది. దొడ్డిదారిన కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని ఆగమేఘాల మీద ప్రభుత్వ సంచుల్లోకి మార్చేస్తున్నారు. తద్వారా మిల్లులో రికార్డులను తారుమారు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. ఒక్కప్పుడు 30శాతం మాత్రమే ఉన్న రీసైక్లింగ్‌ వ్యాపారులు నేడు రెట్టింపైనట్లు తెలుస్తోంది.

అధికారుల మధ్య సమన్వయలోపం
రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన రైల్వే, పౌరసరఫరాల అధికారులు, పోలీసుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం ఉంటే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చు.

దాడులు ఉధృతం చేస్తున్నాం..
పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమో దు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా రేషన్‌ బియ్యం అక్రమ రవా ణా చేస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారితో దాడులు చేయిస్తున్నాం. వీరికి అదనంగా గ్రామ స్థాయి నుంచి నుంచి డివిజన్‌ స్థాయి వరకు టీంలు ఏర్పాటు చేసి రేషన్‌ అక్రమ తరలింపు అరికడతాం.

– నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top