కాసుల వేటకు ‘దారి’


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంజీరను ఆనుకొని ఉన్న పట్టా భూముల నుంచి ఇసుక మేటలు తొలగించేందుకు కొందరు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. 48 సర్వే నంబర్‌లోని 7.39 ఎకరాలలో వేసిన ఇసుక మేటలను తొలగించేందుకు పట్టాదారు వినోద్‌రెడ్డి పేరిట రెవెన్యూ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇందుకోసం కొన్ని మార్గదర్శక సూత్రాలు, ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను సూచించారు.



 వీటి ప్రకారం యంత్రాలను ఉపయోగించకుండా స్థానిక కూలీల ద్వారానే ఇసుకను లారీలలోకి లోడింగ్ చేయాల్సి ఉంటుంది. భూగర్భ జలాలకు నష్టం కలుగకుండా కేవలం నాలుగు అడుగుల లోతులో మాత్రమే ఇసుకను తీయాలని గనుల శాఖ తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. ఇవేమీ పట్టని సదరు వ్యక్తులు ఇసుక మేటలను తొలగించేందుకు ఏకంగా పొక్లయినర్లను రంగంలోకి దింపారు.



యంత్రాల ద్వారా లారీలలో లోడ్ చేసి రోజుకు 200 లారీల ఇసుకను రవాణా చేసేందుకు వీలుగా రూ.35 లక్షలతో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా పైపులు వేసి రోడ్డును నిర్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంత జరుగుతున్నా మంజీరలో అక్రమంగా నిర్మించిన రోడ్డు విషయంలోగానీ, పొక్లయినర్లను దింపడంపైన గానీ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. దీంతో త్వరలోనే మొదలయ్యే ఈ అక్రమ రవాణాను వెనుక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణాశాఖ అధికారులు ఎందుకు నియంత్రించడం లేదన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.



 రోజుకు రూ. రెండు లక్షల రాయల్టీకి ఎసరు

 శెట్లూరు శివారులో మంజీర పరీవాహక ప్రాం తంలో ఇసుక మేటల తొలగింపు పేరిట పొక్లయినర్ల ద్వారా ఇసుక తవ్వకాలు సాగిస్తే, రోజుకు రూ. రెండు లక్షల మేరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉంది. మంజీర పరీవాహక ప్రాంతంలో ఇసుక లారీకి రూ.12 వేలు పలుకుతుండగా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో లారీ ఇసుక ధర రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఉంది. మహారాష్ర్ట, బిచ్కుంద మండలం శెట్లూరు, బీర్కూరు మండలం కిష్టాపూర్‌లలో మళ్లీ ఇసుక క్వారీలు మొదలైతే రోజుకు రూ.200 నుంచి 250 లారీల వరకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ లెక్కన రోజూ రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక తరలిపోతుంది.



 అడ్డుకోకపోతే ఎడారే!

 ఇదే విధంగా మరో ఏడాది పాటు ఇసుక రవాణా సాగితే జిల్లా సరిహద్దులోని మంజీర పరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇసుక క్వారీ లారీలలో లోడింగ్ చేసిన ప్రతి క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రూ.40 రాయల్టీ కింద చెల్లించాలి. నిబంధనల ప్రకారం 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్ల ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాయల్టీ కింద ప్రభుత్వానికి ఒక్కో ఇసుక లారీకి రూ.24 0  నుంచి రూ.600 వరకు  చెల్లించాలి.



రాయల్టీ చెల్లించకుండా రోజుకు రూ. రెండు లక్షల వరకు ఎగవేసిన దాఖలాలు గతంలో అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ, గనుల శాఖలకు పెద్దమొత్తంలో మామూళ్లు అందాయన్న ప్రచారం ఉంది. ఇసుకను రవాణా చేసే లారీకి ప్రత్యేకంగా బాడీలను పెంచడంతో 20 క్యూబిక్ మీటర్ల వ రకు ఇసుకను లోడింగ్ చేస్తారు. ఇందుకోసం రవాణాశాఖ అధికారులకు ఒక్కో లారీకి నెలకు రూ.12 వేలు చెల్లిస్తున్నట్లు లారీల యజమానులే చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే శెక్లూర్ నుంచి పెద్ద మొత్తంలో మంజీర ఇసుకను తరలించేందుకు భారీ రోడ్డును నిర్మించి సన్నద్దమవుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top