
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఆర్టిస్ట్, ‘సాక్షి’కార్టూనిస్ట్ శంకర్ కార్టూన్ చిత్రాల ప్రదర్శన శనివారం రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్‌డ్ ఇమేజ్’పేరుతో నిర్వహించే ఈ 20 ఏళ్ల రాజకీయ చిత్రాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, సూర్యప్రకాశ్, ప్రజా కవి గోరటి వెంకన్న, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు.