ఆర్టీసీ అనుబంధ యూనిట్ల మూత! | RTC lid accessory units | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అనుబంధ యూనిట్ల మూత!

Feb 16 2017 2:58 AM | Updated on Sep 5 2017 3:48 AM

ఆర్టీసీ అనుబంధ యూనిట్ల మూత!

ఆర్టీసీ అనుబంధ యూనిట్ల మూత!

ఆర్టీసీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది.

ఏప్రిల్‌ 1న వరంగల్‌లోని టైర్ల రీట్రేడింగ్‌ యూనిట్‌కు తాళం
అదే దారిలో మియాపూర్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌
బస్‌ బాడీ యూనిట్‌ కూడా మూసేసే యోచన


సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. టైర్ల రీట్రేడింగ్, బస్‌బాడీ తయారీ, టికెట్లు, ఇతర పుస్తకాల ముద్రణ వంటి కీలక అంశాల్లో సొంత యూనిట్లతో ప్రత్యేకత చాటిన తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఆర్టీసీ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా వాటిని వదిలించుకోవాలని నిర్ణయించింది. వాటిని వినియోగించుకుంటే సిబ్బంది జీతాలు, ఇతర రూపంలో అయ్యే ఖర్చు కంటే.. ప్రైవేటు సంస్థలతో ఆ పనులు చేయించుకుంటే అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందని అంచనాకి వచ్చింది.

దీంతో వాటిల్లో పనిచేసేందుకు కొత్తగా సిబ్బంది నియామ కాలు చేపట్టవద్దని నిర్ణయించింది. వాటిలో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర అవసరాలకు మళ్లించటం ద్వారా క్రమంగా వాటిని మూసే యనుంది. ఇందులో తొలి అడుగుగా... వరంగల్‌లో ఉన్న టైర్ల రీట్రేడింగ్‌ యూని ట్‌ను ఏప్రిల్‌ ఒకటి నుంచి మూసేయబో తోంది. ఇప్పటివరకు ఇందులో భారీ ఎత్తున టైర్ల రీట్రేడింగ్‌ చేస్తున్నారు. వరంగల్‌తో పాటు హైదరాబాద్, కరీంనగర్‌లలో కలిపి 3 యూనిట్లున్నాయి. వరంగల్‌ యూనిట్‌ తర్వాత మరికొద్ది నెలల్లో మిగతా 2 యూనిట్లనూ మూసేయబోతున్నారు.

ప్రింటింగ్‌ ప్రెస్‌ మూత?
మియాపూర్‌లో ఆర్టీసీకి సొంత ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది. టికెట్లు మొదలు పుస్తకాల వరకు అన్నీ ఇక్కడే ముద్రిత మవుతాయి. ప్రస్తుతం అన్ని బస్సుల్లో టికెట్‌ జారీ యంత్రాలు ప్రవేశపెట్టినందున టికెట్ల అవసరం లేకుండా పోయింది. ఆ యంత్రా లు మొరాయిస్తే తాత్కాలికంగా జారీ కోసమని అతి స్వల్పంగా ముద్రిస్తున్నారు. ఇక ఆ యూనిట్‌ను కూడా పూర్తిగా మూసేసి అవసరమైన పుస్తకాలు, ఇతరాల ముద్రణ ప్రైవేటుగా చేపట్టాలని నిర్ణయించారు.

బస్‌బాడీ కూడా..
ఆర్టీసీకి మియాపూర్‌లో అతిపెద్ద బస్‌బాడీ యూనిట్‌ ఉంది. కంపెనీల నుంచి బస్‌ ఛాసిస్‌లను కొని వాటికి బాడీలను మాత్రం సొంతంగానే తయారు చేసుకుంటోంది. ఇందులో 300 మందికి వరకు సిబ్బంది ఉంటారు. ఇప్పుడు ఆ బస్‌బాడీని కూడా భారంగా భావిస్తోంది. ప్రైవేటు సంస్థల్లో బస్‌ బాడీతో పోల్చుకుంటే....అన్ని రకాల ఖర్చులు కలుపుకొని ఒక్కో బస్‌ బాడీపై రూ.80 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తాజాగా తేల్చింది. దీంతో ఇక నుంచి ప్రైవేటుగానే బాడీలు రూపొం దించుకోవాలని భావిస్తోంది. ఇటీవల మహీంద్రా కంపెనీ నుంచి కొన్న మినీ బస్‌లకు ఆ కంపెనీలోనే బస్‌బాడీ రూపొం దించారు. భవిష్యత్తులో అన్ని బస్సులకు బయటే బాడీలు రూపొందించే యోచ నలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement