ఆర్టీసీ బస్సు బోల్తా

RTC bus to roll over in Bhupalpally - Sakshi

30 మందికి తీవ్ర గాయాలు 

ఏడుగురి పరిస్థితి విషమం 

భూపాలపల్లి జిల్లాలో ఘటన  

కాటారం(మల్హర్‌): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం కొయ్యూర్‌ పీవీనగర్‌ వద్ద కాటారం – మంథని ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపోకు చెందిన (ఏపీ 01 వై 2992) నంబర్‌ అద్దె బస్సు గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవిసోమన్‌పల్లి మానేరు వంతెన దాటిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కకు దిగి పల్టీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.

ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై బస్సు లోపల భాగాలను గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, 30 మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలవ్వగా మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికుల తల, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. పలువురికి  తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు 108, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను  కాటారం, మహదేవపూర్, మంథని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top