రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తే ఆ భారం భారీగా ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది.
ఎస్కలేషన్ ఇస్తే పెరిగే వ్యయం రూ. 3 వేల కోట్లు మాత్రమే
నేడు కేబినెట్ సబ్ కమిటీకి నీటిపారుదల శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తే ఆ భారం భారీగా ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. ఈ భారం రూ.9 వేల కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని బదులు ఎస్కలేషన్ చెల్లిస్తేనే మేలని, దీని ద్వారా పడేభారం రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా ఆర్థిక వ్యయ భారాలతో లెక్కలు వేసిన అధికారులు నివేదికను బుధవారం కేబినెట్ సబ్ కమిటీకి అందించనున్నారు.
నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
ప్రాజెక్టుల పనులు, ఎస్కలేషన్, రీ టెండర్‌ల అంశాలను చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నేడు మరోమారు భేటీ కానుంది. సచివాలయంలో జరిగే ఈ భేటీకి మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల హాజరు కానున్నారు. ప్యాకేజీల వారీ సమీక్ష అనంతరం మొత్తం నివేదికను కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.