సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలతో పాటు సుమారు 3.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీటిని విడుదల చేయకపోవడంతో
మిర్యాలగూడ : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలతో పాటు సుమారు 3.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీటిని విడుదల చేయకపోవడంతో ఎత్తిపోతల పథకాల కింది ఆయకట్టుతో పాటు ఎడమ కాలువ పరిధిలోని భూములన్నీ బీడుగా మారే పరిస్థితి వచ్చింది. రైతులు ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి సారించడం వల్ల కనీసం 30 శాతం వరకు వరి పంటలు సాగు చేసే పరిస్థితి ఉంది. సాగర్ నీటి కోసం మెట్ట నార్లు పోసుకున్న రైతులు ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయం ద్వారా నాట్లు వేయాలనే ఏర్పాట్లలో ఉన్నారు. పాలేరు, మూసీ, కృష్ణా నదులతో పాటు హాలియా వాగు, తుంగపాడు బంధం సమీపంలో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని సాగు నీటిని వినియోగించుకుంటున్నారు.
పూడికలు తీయిస్తున్న అన్నదాతలు
సమీపంలోని వాగులతో పాటు రైతులు బోర్లు, బావులపై దృష్టి సారించారు. గతంలో నాలుగేళ్లపాటు వరుస కరువుతో ఉన్న సమయంలో బావులు తవ్విన రైతులు ప్రస్తుత అవసరాల మేరకు పూడికలు తీయిస్తున్నారు. దాంతో పాటు ఆయకట్టేతర ప్రాంతాలను మరిపించే విధంగా బోర్లు వేయిస్తున్నారు. ఒక్కొక్క బోరుకు రూ. 20వేల నుంచి 30 వేల వరకు ఖర్చు చేయడంతో పాటు మరో రూ. 20 వేలు వెచ్చించి మోటార్లు బిగిస్తున్నారు.
విద్యుత్‌పై ఆశలు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా విద్యుత్ అందజేస్తామని చెప్పడంతో రైతులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడు గంటల పాటు విద్యుత్ అందిస్తున్న అధికారులు ఖరీఫ్ సీజన్‌లో 9 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ అందిస్తామని చెబుతుండటంతో రైతుల్లో మరింత ఆశలు పెరిగాయి. తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందిస్తే ఖరీఫ్‌లో పుష్కలంగా పంట పండే అవకాశం ఉన్నందున రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రూ. 50 వేలు ఖర్చు పెట్టా
సుమారు 50 వేల రూ పాయలు ఖర్చు పెట్టి బోరు వేశాను. విద్యుత్ సరపడా రావడంతో నాలుగు ఎకరాల పొలం నాటు వేశాను. దుక్కి దున్నడం నుంచి ఇప్పటి వరకు ఎకరానికి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టా. పంట ఏపుగా ఉంది. కరెంటు కూడా సరిపడా వస్తుంది. కరెంటు సరిపడా వస్తేనే పంటలు చేతికి వస్తాయి.
- దుగ్గె బుచ్చయ్య, దామరచర్ల