ప్రక్షాళనకు ప్రణాళిక | registretions to be held by re survey | Sakshi
Sakshi News home page

ప్రక్షాళనకు ప్రణాళిక

Aug 24 2017 1:00 AM | Updated on Aug 15 2018 9:37 PM

ప్రక్షాళనకు ప్రణాళిక - Sakshi

ప్రక్షాళనకు ప్రణాళిక

భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలో రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు.

వచ్చేనెల 15 నుంచి డిసెంబర్‌ వరకు భూముల రికార్డులు సరిచేసే ప్రక్రియ
► కొత్త రికార్డుల ఆధారంగానే పెట్టుబడి సాయం పథకం
► సెప్టెంబర్‌ 1 నుంచి గ్రామాల్లో రైతు సంఘాల ఏర్పాటు
► ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో బృందం
► సీఎంతోపాటు ప్రజాప్రతినిధులకు ఒక్కో యూనిట్‌ బాధ్యత
► నెల రోజులపాటు గ్రామ సభలు.. అందరి సహకారంతో కొత్త రికార్డులకు రూపు.. ముందుగా వివాదాల్లేని భూములు.. తర్వాత కోర్టుల్లో ఉన్న భూములు
► తుది రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదు
► రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం.. కొత్త పాస్‌ పుస్తకాలు కొరియర్‌ ద్వారా రైతు చెంతకు
► భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళనపై
► ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష


భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌
భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలో రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు తేదీలను ఖరారు చేశారు. ప్రక్షాళన చేసిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి రైతు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు తదితర అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జోగు రామన్నతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనకు అవలంబించాల్సిన పద్ధతులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘనందన్‌ రావు నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.

భూరికార్డులు సక్రమంగా, సమగ్రంగా ఉంటేనే పెట్టుబడి పథకం విజయవంతమవుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ‘‘భూ రికార్డులను ప్రక్షాళన చేయడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ భూమి పరిస్థితి ఏంటో తెలియడం వల్ల వివాదాలు, ఘర్షణలకు తావుండదు. నిజానికి ఇది పెద్ద సవాల్‌. చాలా పీటముళ్లుంటాయి. కానీ చిత్తశుద్ధి ఉంటే చేయడం అసాధ్యం కాదు. రికార్డుల ప్రక్షాళన జరిగితే భూ దందాలు కూడా బంద్‌ అవుతాయి’’అని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘భూ రికార్డులను సరిచేసే కార్యక్రమం సెప్టెంబర్‌ 15న పెద్దఎత్తున ప్రారంభం కావాలి. అన్ని మండలాల్లో ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తలా మూడు గ్రామాలను తీసుకుని ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలి. నేను కూడా మూడు గ్రామాలు ఎంపిక చేసుకుంటా. వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, రైతు సంఘాలు చురుకైన పాత్ర పోషించాలి. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా క్రియాశీల పాత్ర పోషించాలి. ఈ ప్రక్షాళనకు కొంతమంది ఉద్యోగులను కూడా తాత్కాలిక పద్ధతిపై తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

సమస్త భూముల వివరాల సేకరణ
రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రైతుల అధీనంలో ఉన్న వ్యవసాయ భూములతోపాటు గ్రామంలో అటవీ, ప్రభుత్వ, దేవాదాయ, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న భూములతోపాటు ప్రభుత్వ భవనాల కింద, చెరువులు, కుంటల కింద ఉన్న భూముల వివరాలన్నీ సేకరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయేత అవసరాలకు బదిలీ చేసిన వ్యవసాయ భూములు, ప్రభుత్వం సేకరించిన భూ వివరాలు, అసైన్‌ చేసిన వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయం చేసుకునే పేదలకు కూడా పెట్టుబడి పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. గ్రామ కంఠాన్ని కూడా నిర్ధారించాలని సూచించారు. మొదటి దశలో వివాదాల్లేని భూములు రికార్డులను సరిచేయాలని చెప్పారు. రెండో దశలో రాష్ట్రంలోని మొత్తం భూభాగాన్ని సర్వే చేయించి, కొత్త మ్యాపులు రూపొందిస్తామన్నారు. తెలంగాణ భూభాగంలో జరిగే మార్పులు ఎప్పటికప్పుడు వెంటనే నమోదయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చెప్పారు.  

పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు..
రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారు. ‘‘క్రయ విక్రయాలు జరిపే రైతులిద్దరూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి. రిజిస్ట్రార్‌కు ఇద్దరి పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి. రిజిస్ట్రార్‌.. అమ్మే వారి పాస్‌ పుస్తకం నుంచి భూమిని తొలగించి కొనేవారి పాస్‌ పుస్తకంలో ఎంటర్‌ చేయాలి. ఆ రెండు పాస్‌ పుస్తకాలను కొరియర్‌ ద్వారా ఎమ్మార్వోకు పంపాలి. నాలుగు పని దినాల్లో ఎమ్మార్వో ఆ క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలు తన కార్యాలయంలోని రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. పాస్‌ పుస్తకాలపై అటెస్ట్‌ చేయాలి. పేరు మార్పిడి చేయాలి. తిరిగి రిజిస్ట్రార్‌కు పంపాలి. రిజిస్ట్రార్‌ తన రికార్డుల్లో నమోదు చేసుకుని కొరియర్‌ ద్వారా రైతులకు పంపాలి. అమ్మేవారు.. కొనేవారు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు రావాలి. తిరగడం, పైరవీలు చేసే పని ఉండకూడదు’’అని స్పష్టంచేశారు.

కొత్త పాస్‌ పుస్తకాలు రూపొందించండి
పాస్‌ పుస్తకాలు, పహాణీల నిర్వహణ మరింత సరళతరం చేయాలని, అవసరం లేని కాలమ్స్‌ తీసేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘పాస్‌ పుస్తకాలు కొత్తవి ఇవ్వాలి. నీటిలో పడినా తడవకుండా, పాడవకుండా ఉండేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పాస్‌ పుస్తకాల సైజు తగ్గించాలి. స్టాంపుల చట్టాలను, రిజి స్ట్రేషన్‌ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేయాలి. భవిష్యత్‌లో ప్రతీ మండలానికి ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే ఎమ్మార్వోకే రిజిస్ట్రేషన్‌ కూడా చేసే అధికారం ఇచ్చే అవకాశాలు పరిశీలించాలి. రెవెన్యూ కోర్టులు కూడా ఇన్ని ఉండాలా? కేవలం కలెక్టర్‌ వద్ద ఒక్క కోర్టు మాత్రమే నిర్వహించాలా? అనే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిషేధిత జాబితా తయారు చేయాలి. ఆ భూములు రిజిస్ట్రేషన్‌ కాకుండా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాదికి కాళేశ్వరం
‘‘రైతులకు కావాల్సింది సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర. ఇప్పటికే రాష్ట్రంలో సాగునీరు అందివ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’అని సీఎం వెల్లడించారు. ‘‘పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అవసరం ఉన్నంత ఉచిత విద్యుత్‌ అందడం వల్ల రైతులు భూగర్భ జలాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు. తర్వాత దశలో గిట్టుబాటు ధర కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులను సంఘటితం చేసే పనికి ప్రభుత్వమే పూనుకుంది. రైతులు సంఘటితమై గిట్టుబాటు ధర పొందే ప్రణాళిక కూడా అమలు చేస్తున్నాం’’అని వివరించారు.

ఇకపై అంతా ఆన్‌లైన్‌లో..
భూ రికార్డులు సరిచేసిన తర్వాత ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలని, ఆ తర్వాత చిన్న మార్పు జరిగినా ఆన్‌లైన్‌లో తెలిసిపోవాలని సీఎం సూచించారు. ‘‘బ్యాంకులు అనుసరించే కోర్‌ బ్యాంకింగ్‌ విధానంలా భూ రికార్డుల నిర్వహణ జరగాలి. ఏటీఎం ద్వారా ఏ బ్యాంకులో, ఏ ప్రదేశంలో డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నా వెంటనే తెలిసిపోతుంది. అదే తరహాలో పాస్‌ పుస్తకాల్లో ఎక్కడ మార్పు జరిగినా అంతటా తెలిసిపోవాలి. అందుకు ప్రతీ రెవెన్యూ కార్యాలయంలో ఒక ఐటీ అధికారిని నియమించాలి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెవెన్యూ శాఖలో వెయ్యి మందిని నియమించాలి. తగిన సామర్థ్యం ఉన్న కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో అన్ని రెవెన్యూ కార్యాలయాల అనుసంధానం జరుగుతుంది’’అని ముఖ్యమంత్రి వివరించారు.

1,100 యూనిట్లు.. 3,600 బృందాలు..
ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. రాష్ట్రం మొత్తాన్ని 1,100 యూనిట్లుగా విభజించారు. మొత్తం 3,600 బృందాలను ఎంపిక చేస్తారు. రెవెన్యూ అధికారి, వ్యవసాయాధికారి, గ్రామ రైతు సంఘం సమన్వయంతో ఒక్కో గ్రామంలో ఒక్కో బృందం నెల రోజుల పాటు ఉండి గ్రామ సభలు నిర్వహిస్తుంది. రైతులందరి సహకారం, అంగీకారంతో భూ రికార్డులను సరిచేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో యూనిట్‌కు బాధ్యత తీసుకుని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.

అందుకే ఈ ప్రక్షాళన..
‘‘1932–36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగింది. మళ్లీ జరగలేదు. భూ రికార్డుల నిర్వహణ గందరగోళంగా ఉంది. వ్యవసాయ శాఖ వద్ద వివరాలకు, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతన లేదు. దీంతో ప్రభుత్వం ఇవ్వాలనుకునే పెట్టుబడి సాయం ఏ ప్రాతిపదికన అందించాలో తెలియని పరిస్థితి. ఈ పొరపాట్లతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగే అవకాశం ఉంటుంది. మంచి చేయబోతే చెడు అవుతుంది. అందుకే ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో, పెట్టుబడి ఎవరికి అందాలో తెలుసుకునేందుకే ఈ ప్రక్షాళన చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.  

వివాదాల్లేనివి ఫస్ట్‌..
ఎలాంటి వివాదాలు లేని భూములు దాదాపు 85 నుంచి 95 శాతం వరకు ఉంటాయని అంచనా. ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ ముందు గా ప్రక్షాళన చేస్తారు. పేర్ల మార్పిడి, క్రయ విక్రయాలు జరిగిన వివరాలు తీసుకుంటారు. రికార్డులకు తుదిరూపం ఇస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రెండో దశలో వివాదాస్పద భూములకు సంబంధించి పరిష్కార మార్గాలు చూస్తారు. కోర్టు వివాదాలుంటే, తీర్పులననుసరించి యాజమాన్య హక్కులను నిర్ణయిస్తారు. డిసెంబర్‌ నెలాఖరు నాటికి రికార్డులన్నీ సరిచేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీని ఆధారంగానే రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తారు.  

ఇదీ కార్యాచరణ..
సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు
గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితి ఏర్పాటు. గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నవారంతా రైతు సంఘంలో సభ్యులుగా ఉంటారు. 11 మందితో సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి.
సెప్టెంబర్‌ 10 నుంచి 15 వరకు
మండల స్థాయిలో సమితుల సదస్సుల నిర్వహణ
సెప్టెంబర్‌ 15న
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు
రెవెన్యూ గ్రామం యూనిట్‌గా రికార్డుల ప్రక్షాళన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement