‘కరోనా’ కోసం రైల్వే ఆసుపత్రులు 

Railway Hospitals For Coronavirus In Telangana - Sakshi

వేయి పడకలతో క్వారంటైన్‌ వార్డు

63 బెడ్‌లతో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు

రైలు బోగీల్లో 7,776 బెడ్లతో మరిన్ని వార్డులు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసులకు సంబంధించి వైద్య సాయం, అనుమానితుల క్వారంటైన్‌ కోసం రాష్ట్రాలతో పాటు రైల్వే శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రైల్వే ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, రైలు బోగీలను ఐసోలేషన్, క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో ప్రయోగాత్మకంగా వాటిపై దృష్టి సారించగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని జోన్‌లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలుత 63 పడకలతో కూడిన ఐసోలేషన్‌ వార్డు, వేయి పడకలతో కూడిన క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది.

ఇప్పటికే మౌలాలిలోని రైల్వే ఆసుపత్రితోపాటు అన్ని డివిజన్‌ కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వీటి      ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది. మరో ఐదారు రోజుల్లో ఇవి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు ఎక్కడికైనా     తరలించేలా బోగీలను కూడా సిద్ధం చేసే పనిని వేగిరం చేసింది. 486 కోచ్‌లను క్వారంటైన్,    ఐసోలేషన్‌ వార్డులుగా మార్చబోతోంది. ఒక్కో కోచ్‌లో 16 బెడ్లు ఉంటాయి. మొత్తంగా 7,776 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఇందులో మొదటి కూపేను పారా మెడికల్‌ సిబ్బందికి, మిగతా 8 కూపేలను బాధితులకు కేటాయిస్తారు. ప్రతి కూపేలో రెండు బెర్తులను బెడ్లుగా మారుస్తారు.

కాంట్రాక్టుపై పారా మెడికల్‌ సిబ్బంది..
కరోనా బాధితులు ఎంతమందితో కాంటాక్ట్‌ అయ్యారో గుర్తించి వారిని వెంటనే క్వారంటైన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధీనంలోని   క్వారం టైన్‌ కేంద్రాలు, ఆసుపత్రులు చాలని పక్షంలో రైల్వే ఏర్పాటు చేసిన కోచ్‌లను వినియోగిస్తారు. ఇందు కు రైల్వే శాఖకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బం ది సరిపోరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద మొత్తం లో పారా మెడికల్‌ స్టాఫ్‌ను కాంట్రాక్టు పద్ధతిలో తీçసుకోవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పత్రిక ప్రకటన, ఆన్‌లైన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top