రాహుల్‌ తొలి టూర్‌ తెలంగాణలోనే? | Rahul's first tour in Telangana? | Sakshi
Sakshi News home page

రాహుల్‌ తొలి టూర్‌ తెలంగాణలోనే?

Dec 9 2017 3:38 AM | Updated on Dec 9 2017 5:08 AM

Rahul's first tour in Telangana? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెలంగాణలోనే పర్య టించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలో పర్యటించాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు వరంగల్‌ జిల్లాలో, హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ బలం పెంచుకోవడానికి, రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపడానికి రాహుల్‌ పర్యటన ఉపయోగపడుతుందని టీపీసీసీ భావిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని గతంలోనే కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. సభను మహబూబాబాద్‌లో ఎస్టీ గర్జనగా మారుస్తూ నిర్ణయించారు. ఐదారు నెలల నుంచి వరంగల్‌ పర్యటన వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్‌ లేదా సదస్సు, బహిరంగసభ వంటివి నిర్వహించాలని ఓయూ విద్యార్థులు, కాంగ్రెస్‌ నేతలు అనుకున్నారు. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు.  

విద్యార్థులతో కార్యక్రమాలూ వాయిదా..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత విద్యార్థులతో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ నేతల ప్రతిపాదన మూడున్నరేళ్లు దాటినా ఇంకా ఆచరణలోకి రాలేదు. సంగారెడ్డి బహిరంగ సభకు హాజరైన తర్వాత ఇంతవరకు రాష్ట్రానికి రాలేదు. అధ్యక్షుడి హోదాలో తెలంగాణలోనే తొలి పర్యటన ఉండాలని టీపీసీసీ ముఖ్యులు రాహుల్‌ను అభ్యర్థించినట్లు తెలిసింది. దీనికి ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్‌లోనే రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని 2009 డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా రాహుల్‌ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీనేతల అంచనా. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాగాంధీపై తెలంగాణవాదులకు విశ్వసనీయత ఉందని, రాహుల్‌ గాంధీ పర్యటనలో ఇదే విషయాన్ని చెప్పుకొంటే కాంగ్రెస్‌కు మరింత సానుకూల వాతావరణ ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని పార్టీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పార్టీకి బలమైన పునాదులున్న రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కూడా పెద్ద కష్టం కాదనే విషయంలో ఏఐసీసీకి స్పష్టత ఉందంటున్నారు. రాహుల్‌ పర్యటన వల్ల రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న పొరపచ్చాలను కూడా పరిష్కరించే వీలుంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement