రబీ కష్టాలు గట్టెక్కేనా..? | Rabe gattekkena trouble ..? | Sakshi
Sakshi News home page

రబీ కష్టాలు గట్టెక్కేనా..?

Jan 25 2015 6:13 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఖరీఫ్‌లో కష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలగలేదు. రబీలోనూ అవస్థల మధ్య సాగర్ నీరు అందుతోంది.

  • 31.40 టీఎంసీల సాగర్ నీరు అవసరం
  • లేదంటే సాగు ప్రశ్నార్థకమే..
  • ఖమ్మం అర్బన్ : ఖరీఫ్‌లో కష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలగలేదు. రబీలోనూ అవస్థల మధ్య సాగర్ నీరు అందుతోంది. పంటలు చేతికి అందాలంటే ఖరీఫ్‌లో మిగిలి ఉన్న పంటలకు మార్చి 15, రబీలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్ 15 వరకు నీరు అందాల్సి ఉంది. ఆయకట్టు లెక్క ప్రకారం 31.40 టీఎంసీల నీరు కావాల్సిందేనని ఎన్నెస్పీ అధికారులు నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఎన్నెస్పీ అధికారుల లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో టేకులపల్లి సర్కిల్ (ఖమ్మం) పరిధిలోని జోన్ 1,2,3లో రైతులు 2 లక్షల 23 వేల 591 ఎకరాలు సాగు చేశారు.

    ప్రభుత్వం కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 35 టీఎంసీలను వాడుకున్నారు. ఇందులో లక్షా 20 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, మిరప తోటలు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసిన వాటిని పంట చేతికందే వరకు కనీసం 9.16 టీఎంసీలు నీరు అవసరం ఉందని, దీని ద్వారా లక్షా 11 వేల 565 ఎకరాల్లో పంట చేతికందుతుందని లెక్కలు చెబుతున్నాయి.

    రబీలో సాగులో ఉన్న లక్షా 39 వేల ఎకరాలకు  22.24 టీఎంసీలు నీరు అవసరం ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో జోన్ 1,2,3లో లక్షా 20 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని జోన్1 పరిధిలో 19 వేల 500 ఎకరాలకు నీరు అందిస్తే తప్ప పంట సక్రమంగా చేతికందే పరిస్థితి ఉంటుందంటున్నారు. ప్రధానంగా రబీలో కల్లూరు డివిజన్ పరిధిలోని కల్లూరు,  తల్లాడ, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం తదితర మండలాల్లో అత్యధికంగా రైతులు వరి సాగు చేశారని చెబుతున్నారు. వీటితోపాటు వైరా చెరువు, పాలేరు చెరువు తదితర ప్రధాన జలాశయాల పరిధిలో కూడా రైతులు వరి సాగు చేశారు.

    అధికారికంగానే కాకుండా అనధికారికంగా వేలాది ఎకరాలను రైతులు వివిధ రకాల పంటను సాగు చేశారు. సాగునీటితోపాటు వేసవిలో తాగునీటి అవసరాలకు కూడా  అదనంగా నీరు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి కాల్వల పరిధిలో చివరి భూములకు నీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఎన్నెస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆరురోజుల క్రితం ఎన్నెస్పీ ఎస్‌ఈని పాలేరు నియోజకవర్గంలోని రైతులు ఘెరావ్ చేసి ఆందోళనకు దిగారు.

    సాగునీరు అందించాలని కోరారు. సాగునీటి కోసం కల్లూరు డివిజన్ రైతుల నుంచి మరింత డిమాండ్ ఉందని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సాగర్ జలాశయంలో నిల్వలు తగ్గడంతో డిమాండ్‌కు అనుగుణంగా నీరు అందించడం ప్రశ్నార్థకమేనని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రబీ పంటలు చేతికి అందేలా చర్యలు చేట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement