పుప్పాలగూడ భూములు సర్కారువే

Puppalaguda Land Belongs To Government Declared By Supreme Court - Sakshi

కాందిశీకుల వారసులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాందిశీకులకు భూముల కేటాయింపు వివాదంపై సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో రూ. కోట్ల విలువైన 198.30 ఎకరాలను రమేష్‌ పరశరాం మలాని తదితరులకు కేటాయిస్తూ 2003లో ఉమ్మడి ఏపీ సీసీఎల్‌ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2016లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కాందిశీకుల భూములను కేటాయించే అధికారం సీసీఎల్‌ఏకి లేదని పునరుద్ఘాటించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రమేష్‌ మలాని దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

కాందిశీకుల భూములను ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసిన తర్వాత ఆ భూములను ఇతరులకు కేటాయించే అధికారం రాష్ట్ర పరిధిలోని మేనేజింగ్‌ అధికారి లేదా సెటిల్‌మెంట్‌ కమిషనర్‌కు మాత్రమే ఉందంది. 13 ఏళ్ల పాటు కోర్టుల్లో నడచిన ఈ కేసులో ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఈ భూములు ఎకరా రూ. 35 కోట్లు పలుకుతోంది. మొత్తం ఎకరాలను పరిగణనలోకి తీసుకుంటే దీని విలువ రూ.7 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లను సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హక్కులు దక్కించుకున్న భూములను వేలం వేసే వీలుంది.

కేసు పూర్వాపరాలు ఇవీ.. 
పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి మన దేశానికి శరణార్థునిగా వచ్చిన పరశరాం రాంచంద్‌ మలాని అనే వ్యక్తికి రంగారెడ్డి జిల్లాలో అప్పటి హయత్‌నగర్‌ మండలం బాటసింగారం, హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో మొత్తం 323.10 ఎకరాలను 60 ఏళ్ల క్రితం కేటాయించారు. బాటసింగారంలో 262.11 ఎక రాలు, బోయిన్‌పల్లిలో 60.39 ఎకరాలిచ్చారు. పాక్‌లో ఆయనకున్న 83.11 ఎకరాలను విడిచిపెట్టి వచ్చినందుకు బదులుగా హైదరాబాద్‌లో 200 ఎకరాలు ఇవ్వాలని కోరగా సదరు భూమిని పంపిణీ చేశారు. కొద్దికాలం తర్వాత సదరు భూమిని ఇతరులకు విక్రయించిన రాంచంద్‌... 1988లో మరణించారు. ఆయన బతికినన్ని రోజు లు సదరు భూమిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత 13 ఏళ్లకు అంటే 2001లో అసలు కథ మొదలైంది.

పాక్‌లో తాము విడిచిపెట్టి వచ్చిన 83.11 ఎకరాల్లో.. 40.4 ఎకరాలకు సమానమైన ఆస్తిని మాత్రమే తమకు కేటాయించారని రాంచంద్‌ వారసులైన రమేష్‌ పరశ రాం మలాని, మరికొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన 43.7 ఎకరాలకు సమానమై న ఆస్తిని కేటాయించలేదని, ఆ మేరకు భూమిని పంపిణీ చేయాలని 2001లో కోరారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి సీసీఎల్‌ఏ తీసుకెళ్లగా స్పందన రాలేదు. మరోసారి పిటిషనర్‌ సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేయగా పుప్పాలగూడలో 301 నుంచి 308, 325 నుంచి 328, 331 సర్వే నంబర్లలో 2003 ఫిబ్రవరి 26న 148.3 ఎకరాలు, ఇత రులకు మరో 50 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ కేటాయింపులను అదే సంవత్సరం మార్చి 20న ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇదే సమయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి పిటిషనర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన స్టే, షోకాజ్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రివిజినల్‌ విభాగాన్ని సంప్రదించాలని కోర్టు సూచించింది. దీంతో అక్కడికి వెళ్లిన పిటిషనర్‌కు అనుకూలంగా సదరు విభాగం వ్యవహరిం చింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి హైకోర్టులో 2016 ఫిబ్రవరి 16న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు చెప్పడంతో భూ కేటాయింపులను రద్దు చేసింది. 50 ఎకరాలు పొందిన ఇతరులు కేసు ఉపసంహరించుకున్నారు. సదరు భూములను ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు.

అయితే కేసు తేలే వరకు భూములను విక్రయించకూడదని, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. తాజాగా ఈ కేసుపై వాదనలు జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు తుది తీర్పును మంగళవారం వెలువరించింది. దీంతో ప్రభుత్వానికి ఊరట కలిగింది. ప్రస్తుతం ఈ భూమిలో 150 ఎకరాలు ఖాళీగా ఉండగా దీని చుట్టూ యంత్రాంగం ఫెన్సింగ్‌ వేసింది. మరో 40కి పైగా ఎకరాలను వివిధ అవసరాలకు వినియోగించింది. ఈ భూమిని 2006లోనే అప్పటి హుడా (ప్రస్తుత హెచ్‌ఎండీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top