ఖద్దరు మాటున కబ్జాలు   | Sakshi
Sakshi News home page

ఖద్దరు మాటున కబ్జాలు  

Published Wed, Jul 3 2019 11:54 AM

Political Leaders Involved In Land Mafia In Adilabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కన్ను పడిందంటే చాలు తమ ఆధీనంలోకి రావాల్సిందే. లేదు, కాదు అంటే అనుచరులను రంగంలోకి దింపి ఆక్రమణకు గురిచేయడమే. ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న కొంత మంది తీరు ఇది. ఖద్దరు మాటున యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ, ఎదురుతిరిగితే బాధితులను భయబ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారం కుమురం భీం జిల్లాలో జోరుగా సాగుతోంది. అధికారం గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సిర్పూర్‌ నియోకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి భూదందాలు, కబ్జాలు రానురానూ తారాస్థాయికి చేరుతున్నాయి.

సర్‌సిల్క్‌ మిల్లుకు సంబంధించిన భూముల్లో తన అనుచరుల్ని రెచ్చగొట్టి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. సర్‌సిల్క్‌ భూముల్లో  తనకు వాటా ఇవ్వకుంటే రాత్రికి రాత్రే గుడిసెలు వేయిస్తాని బెదిరిస్తున్నారు. గత నెల 6లోపే పది ఎకరాల భూమి ఇవ్వాలని, లేకపోతే భూమి దక్కకుండా చేస్తానని చట్టబదంగా కొనుగోలు చేసిన యజమానికి సైతం డెడ్‌లైన్‌ విధించడం విశేషం. కాగజ్‌నగర్‌లో గత 34 ఏళ్ల క్రితం మూతపడిన సర్‌సిల్క్‌ వస్త్ర పరిశ్రమ కింద మొత్తం 808 ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఇందులో ఫ్యాక్టరీ, వ్యాపార సముదాయం, నివాస స్థలాలు, క్వార్టర్లు, ఖాళీ స్థలంతో పాటు దీనికి సంబంధించిందే కోసిని, చింతగూడలో వ్యవసాయ భూములు ఉన్నాయి.

1985లో మిల్లు మూతపడే నాటికే ఈ భూముల్లో కొంత ఆక్రమణలు గురయ్యాయి. అప్పటికే ఐడీబీఐ బ్యాంకు, వర్కర్లకు కలపి రూ.35.84 కోట్లు బకాయిలు ఉన్నాయి. దీంతో మిల్లు భూములను కొంత కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత 1991లో అప్పటి ఉమ్మడి హైకోర్టు అధికారికంగా లిక్విడేటర్‌ని నియమించి మిల్లు ఆస్తులను మదింపు చేయించింది. బకాయిలతో పాటు ఆస్తులను లెక్కగట్టి యాక్షన్‌కు పిలిచింది. భూములు కొనుగోలు చేసేందుకు మొత్తం 14 బిడ్డింగులు వచ్చాయి. ఇందులో మూడో బిడ్‌ వేసిన బి.వెంకట నారాయణరావు దాదాపు రూ.3 కోట్లతో మొత్తం 182 ఎకరాలకు యాక్షన్‌ చేయగా ఇందులో 156 ఎకరాలు అధికారికంగా ఇచ్చారు. అప్పటికే అందులో ఆక్రమణలు ఉండగా వారిని ఖాళీ చేయించి మరీ ఆయనకు ఇవ్వాల్సిందిగా ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయితే ఆ ఆక్రమణలు ఖాళీ చేయకపోగా రానురానూ కబ్జాలు పెరిగిపోతున్నాయి.

9 ఏళ్లుగా భూమి కోసం..
హైకోర్టు యాక్షన్‌లో పూర్తి డబ్బులు చెల్లించిన నారాయణరావుకు భూమి సర్వే చేసి హద్దులు చూపాల్సిందిగా 2011లో పేర్కొన్నారు. అయితే తొమ్మిదేళ్లు గడుస్తున్నా స్థానిక అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీనిపై కలెక్టర్, ఎస్పీ, సీఎంవో కార్యాలయానికి, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్, కోసిని గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు అనేక మందిని చట్టబద్దంగా కొనుగోలు చేసిన తన భూమిని ఇప్పించాలని వేడుకుంటున్నాడు. అయినా స్థానిక అధికారులు మాత్రం కనికరించడం లేదు. సర్వే కూడా చేపట్టడం లేదు. దీనికంతటికీ స్థానికంగా ఓ ప్రజాప్రతినిధే కారణం. ఆయనే చక్రం తిప్పుతుండడంతో అటు కబ్జాలు పెరగడంతో పాటు ఇటు మిల్లు భూములు అధికారికంగా కొనుగోలు చేసిన వారికి దక్కకుండా పోతున్నాయి. 

పదెకరాలు ఇవ్వాలని డెడ్‌లైన్‌..
హైకోర్టు లిక్విడిటేర్‌ ద్వారా కొనుగోలు చేసిన సర్‌సిల్క్‌ భూములకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ఈ భూములు సిర్పూర్‌ వెళ్లే దారిలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ.కోటి వరకు ధర పలుకుతోంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూమిలో తనకు పదెకరాల భూమి ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి నారాయణరావుపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు.

అయితే తాను డబ్బులు పెట్టి కోనుగోలు చేసిన భూమిని ఎందుకు ఇవ్వాలని ఎదురుతిరగడంతో సర్వే చేపట్టకుండా అధికారులపై ఒత్తిడి తెస్తూ పెండింగ్‌లో ఉండేలా చేస్తున్నారు. తన భూములు సర్వే చేయాలని 2014లోనే రూ.14లక్షలు చెల్లించినా సర్వే అధికారులు స్పందించడం లేదని నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయనకు భూమి స్వాదీనం చేయకపోగా, మరింత కబ్జాలను తన అనుచరులతో ప్రోత్సహిస్తున్నారు. ఇందులో అక్రమ కట్టడాలు, సెల్‌ఫోన్‌ టవర్లతో పాటు ఇతర నిర్మాణాలను చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ రకంగానైనా తన దారికి తెచ్చుకుని పదెకరాల భూమి పొందాలని సదరు ప్రజాప్రతినిధి యోచన. 

అనుచరులతో ఆక్రమణ..
తాను చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని ఎట్టి పరిస్థితిల్లోనూ ఇచ్చేది లేదని నారాయణరావు తెగించి చెప్పడంతో వివిధ సామాజికవర్గాలకు చెందిన వారిని కబ్జాలకు ఉసిగోలుపుతు చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నంలోనే ఇటీవల ఎక్కడికక్కడ ఆక్రమణలు సాగుతున్నాయి.

ఇటీవల జిల్లా కలెక్టర్‌ దీనిపై వారం రోజుల్లో విచారణ జరపాలని కాగజ్‌నగర్‌ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. అయినా స్పందన లేదని నారాయణరావు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్త ఆక్రమణల్లో సర్‌సిల్క్‌ మిల్లు కార్మికుల కంటే కార్మికేతరులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కబ్జాలు చేసిన వారికి స్థానిక అధికారులు ఇళ్ల నంబర్లు ఇవ్వడంతో పాటు కరెంటు కనెక్షన్లు కూడా ఇచ్చారు. కొంత మంది గుట్టుగా నిర్మాణాలు కూడా సాగిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement