రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత

Police Security Should Be Set Up At All Revenue Offices - Sakshi

జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఉత్తర్వులు

రెవెన్యూ జేఏసీ విజ్ఞప్తి మేరకు..

సాక్షి, హైదరాబాద్‌ : తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమైన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అన్ని కార్యాలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెవెన్యూ యంత్రాంగం భయాందోళనలకు గురవుతోందని, వెంటనే తమకు భద్రత కల్పించాలని రెవెన్యూ జేఏసీ (ట్రెసా) చేసిన విజ్ఞప్తి మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌కుమార్‌ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.

►అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాటు చేయాలి.
►తహసీల్దార్‌ కార్యాలయాల్లోకి రాకపోకల కోసం ప్రత్యేక పద్ధతిని పాటించాలి. అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలి
►తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసే ‘గ్రీవెన్స్‌’కార్యక్రమం కోసం నిర్దేశిత వేళలు నిర్ధారించాలి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది హాజరయ్యేలా చూడాలి.
►కలెక్టర్లు తమ నిధులతో వెంటనే అన్ని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కార్యాలయంలోని అన్ని ప్రాంతాలు ఆ పరిధిలోకి వచ్చే విధంగా వాటిని అమర్చాలి.
►కొత్తగా ఏర్పాటయిన కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మౌలిక వసతుల కోసం తీసుకున్న చర్యల నివేదికను పంపించాలి.
►అధికారుల చాంబర్లను కోర్టు హాళ్లను మాదిరిగా ఆధునీకరించాలి.
►ముఖ్యమైన చట్టాలు, మెజిస్టీరియల్‌ కార్యనిర్వాహక అంశాలపై జిల్లా శిక్షణా కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top