‘మౌఖిక విచారణ’ పట్టించుకోరా?

police oral inquiry cases in pending from years - Sakshi

ఏళ్లుగా పెండింగ్‌లో పోలీసుల మౌఖిక విచారణ కేసులు

పదోన్నతులు, ఇంక్రిమెంట్లకు నోచుకోని అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: మౌఖిక విచారణ కేసులు పోలీస్‌ అధికారులను వేధిస్తున్నాయి. ఏళ్లుగా మౌఖిక విచారణ పెండింగ్‌లో ఉండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు నిరాశకు గురవుతున్నారు. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, పతకాలు దక్కడం లేదని వాపోతున్నారు. ఓరల్‌ ఎంక్వైరీ (ఓఈ)కి ఆదేశించిన ఘటనలపై పోలీస్‌ శాఖ సీరియస్‌గా దృష్టి సారించాలని, తప్పని తేలితే చర్యలు తీసుకోవాలని, ఏళ్ల పాటు తేల్చకుండా పదవీ విరమణకు దగ్గరవడం తీరని ఆవేదనకు గురిచేస్తోందంటున్నారు.  

దర్యాప్తు లేదు.. నివేదిక రాదు
అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, అక్రమార్జన వ్యవహారాల్లో సస్పెండైన అధికారుల పై విచారణ జరుపుతారు. దీనిలో భాగంగా ముందు సస్పెండ్‌ చేయడం, 3 నెలల సస్పెన్షన్‌ ఎత్తివేసి ఓఈ నిర్వహించి ఆ నివేదిక ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, అన్యాయం జరిగిన బాధితులకు ఊరట లభించక తీవ్ర జాప్యం జరుగుతోంది.  

జిల్లాకు 35 మంది
రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇప్పటివరకు తెలంగాణ పోలీస్‌ శాఖలో 300లకు పైగా మౌఖిక విచారణ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాకు 30–35 మంది అధికారులు, సిబ్బందిపై ఓరల్‌ ఎంక్వైరీలు పెండింగ్‌లో ఉన్నాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్నప్పుడు జరిగిన కొన్ని హత్య కేసులూ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో సంబంధిత అధికారులపై మౌఖిక విచారణ జరపలేని దుస్థితి ఉందని నిఘా వర్గాల ద్వారా తెలిసింది. సివిల్‌ సెటిల్‌మెంట్లు, లాకప్‌డెత్, కస్టోడియల్‌ డెత్, అకారణంగా హింసించడం, హెచ్‌ఆర్‌సీ ఆదేశాల విచారణ.. ఇలా రకరకాల మౌఖిక విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రధాన కారణాలివే..
పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం 3 నుంచి 6 నెలల్లో మౌఖిక విచారణ పూర్తి చేయాలి. కానీ 2010 నుంచి ఇప్పటివరకు 300లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మౌఖిక విచారణ జరపాల్సిన అధికారులు బదిలీ కావడం, పదవీ విరమణ చేయడం, బాధితులు విచారణకు సహకరించకపోవడం, సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పకపోవడంతో వంటి కారణాలతో విచారణ ముందుకు సాగడం లేదని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తెలిపారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఏళ్ల పాటు పదోన్నతి లేకుండా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top