బిల్లు ఆమోదం రాజ్యాంగ విరుద్ధం | polavaram bill approval is unconstitutional | Sakshi
Sakshi News home page

బిల్లు ఆమోదం రాజ్యాంగ విరుద్ధం

Jul 13 2014 2:28 AM | Updated on Sep 2 2017 10:12 AM

పోలవరం ముంపు ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని రద్దుచేసే వరకూ ఆందోళనలు నిర్వహిస్తామని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.

ఖమ్మం జడ్పీసెంటర్ : పోలవరం ముంపు ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని రద్దుచేసే వరకూ ఆందోళనలు నిర్వహిస్తామని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. గిరిజన చట్టాలను ప్రజల ఆకాంక్షలు పోలవరంలో ముంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టవిరుద్ధమన్నారు. జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వెనుక కుట్రదాగియుందన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఉరిశిక్షపడ్డ నేరస్తులకు సైతం చివరికోరిక ఏంటని అడుగుతారని, కానీ కేంద్రప్రభుత్వం గిరిజన ప్రజలను ముంచుతూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నామని కూడా మరిచి ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండా బిల్లును ఆమోదించటం రాజ్యంగ ఉల్లంఘన అన్నారు.

 300లకు పైగా గ్రామాలు 2.50లక్షలకు పై గిరిజనులను ముంచుతూ అప్రజాస్వామికంగా బిల్లును పాస్‌చేయడం ఎన్డీఏ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. గిరిజన చట్టాలను చేసి కేంద్రం ఆర్టికల్-3, 5, ఫీసా చట్టాలను తుంగలో తొక్కారని ఆరోపించారు.  ఏఐకేఎంస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగయ్య మాట్లాడుతూ తెలంగాణాలో ఏడు మండలాలను కొనసాగించాలని రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు.

 సీపీఎం జిల్లా నాయకులు ఎర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ  బిల్లును ఉపసంహరించాలని రేపు ఢిల్లీలో జరిగే ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు మాట్లాడుతూ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు పోరాడినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాణోత్ కిషన్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనులను ముంచుతూ కేంద్రంతీసుకున్న ఈ నిర్ణయం చట్టవ్యతిరేకమన్నారు.  టీజే ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట నారాయణ మాట్లాడుతూ రెండులక్షల మందికి పైగా గిరిజనులను పోలవరం పేరుతో జలసమాధి చేయటం సరికాదన్నారు.

 ప్రదర్శన, మానవహారం...
 బంద్‌లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన సీపీఎం, న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, లంబాడీ హక్కుల పోరాట సమితి, పీఓడబ్ల్యూ, ఐద్వా, టీయూడబ్ల్యూజేఎఫ్, టీజేఎఫ్ జర్నలిస్టుల సంఘాలు స్థానిక బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నాయి. అనంతరం అక్కడి నుండి భరీ ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం  కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement