తెప్పోత్సవానికి పెథాయ్‌ దెబ్బ 

Pethai blow to the Badrachalam fest - Sakshi

     భద్రాచలంలో సీతారాముల జల విహారానికి ఆటంకం 

     హంసవాహనంలో స్వామి, అమ్మవార్లకు పూజలు 

భద్రాచలంటౌన్‌: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం ముందు రోజున పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించేందుకు జిల్లా అధికారులు సోమవారం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే పెథాయ్‌ తుపాను ప్రభావంతో సీతారాముల జలవిహారానికి అంతరాయం ఏర్పడింది. తీరంలోనే హంసవాహనాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. భద్రాచలం రామాలయం చరిత్రలో ఇలా ఆటంకం ఏర్పడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. అయితే స్వామి, అమ్మవార్లను గర్భగుడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ గోదావరి తీరానికి తీసుకొచ్చి, హంసవాహనంపై కూర్చుండబెట్టారు.

అంతకుముందు పుణ్య జలాలతో హంస వాహనాన్ని సంప్రోక్షణ చేసిన అర్చకులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు ఆలయ ఈఓ రమేశ్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చ తుర్వేదాలు, నాళాయిర దివ్యప్రబంధం, పం చసూత్రాలు పఠించారు. అనంతరం మంగళహారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. హంస వాహనంలో ఆశీనులైన సీతారాములను చూసి భక్తులు పులకించిపోయారు. కాగా, స్వామివారు గోదావరిలో విహరించకపోవడంతో భక్తులు కొంతమేర అసంతృప్తికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రా«ధిక, సబ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రా, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top