వ్యర్థాల నియమావళి బాధ్యత పీసీబీదే

PCB is responsible for the waste regulation Says Sk joshi - Sakshi

భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్‌కు కొత్త ప్లాంట్లు 

పటాన్‌చెరు ప్రాంతంలో ఎస్‌టీపీకి త్వరలో డీపీఆర్‌ 

ఎన్‌జీటీ ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎస్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్, బయో మెడికల్‌ వేస్ట్‌ నియమాల అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి అప్పగించి, ప్రత్యేక అధికారులను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌కే జోషి ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీ సైక్లింగ్‌ చేసేందుకు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నియమాల అమలుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఎన్‌జీటీకి సమర్పించాల్సిన నివేదికలకు చెందిన సమాచారాన్ని ఈ నెల 23వ తేదీలోగా పీసీబీకి సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహాల నుంచి 8,450 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, 8,273 మెట్రిక్‌ టన్నులు గడప గడపకూ వెళ్లి సేకరిస్తున్నట్లు సీఎస్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

వ్యర్థాల సేకరణ కోసం ‘సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2016’కు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు వివరించారు. పురపాలక సంఘాల్లో డంపింగ్‌ యార్డులకు అవసరమైన స్థల సేకరణ, వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలను తగుల బెట్టడంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలను జోషి సమీక్షించారు. 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజూ 15వేల కిలోల బయో మెడికల్‌ వేస్ట్‌ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని నిషేధించి, నిబంధనలు అతిక్రమిం చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  

నదుల పునరుజ్జీవనంపై ప్రణాళిక 
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు అనుగుణంగా నదీ కాలుష్యాన్ని నివారించేందుకు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నదుల పునరుజ్జీవనం ప్రణాళికపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యతలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర కాలు ష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి నివేదిక సమర్పించినట్లు అధికారులు వివరించారు. జూన్‌ 30 నాటికి తర్వాతి ప్రాధాన్యతా క్రమంలో నదుల్లో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికపై నివేదిక సమర్పిస్తామన్నారు.

వాయు, పారిశ్రామిక కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ఈ సమావేశంలో జోషి సమీక్ష జరిపారు. కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు (ఈటీపీ), ఉమ్మడి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు (సీఈటీపీ), మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల (ఎస్‌టీపీ) పనితీరుపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1979 పరిశ్రమల్లో ఈటీపీలు పనిచేస్తున్నాయని, పనిచేయని చోట సం బంధిత పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు మరో 372 ఎస్‌టీపీలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు.

నెల రోజుల్లో పటాన్‌చెరు ఎస్‌టీపీ 
పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఖాజిపల్లి, ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట, గండిగూడెం, ఆ సానికుంట చెరువుల్లో కాలుష్య నివారణకు ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. ఈ ఎస్‌టీపీల ఏర్పాటుకు వీలుగా సవివర ప్రణాళిక నివేదిక (డీపీఆర్‌) తయారు చేయడంతో పాటు నిధుల సేకరణ వ్యూహాన్ని కూడా నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌టీపీ ఏర్పాటు విషయంలో చెన్నై ఎన్‌జీటీ జారీ చేసిన ఆదేశాలపై ఆరోగ్య, నీటిపారుదల, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావుతో ప్రత్యేకంగా చర్చించారు.

కాగా, ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్‌ నదీమ్‌ అహ్మద్, మున్సిపల్‌ డైరెక్టర్, కమిషనర్‌ టి.కె.శ్రీదేవిలతో పాటు గనులు, ఆరోగ్య, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top