1580 ఏళ్ల కిందటే బుద్ధపూర్ణిమ!

1580 ఏళ్ల కిందటే బుద్ధపూర్ణిమ!


బుద్ధపూర్ణిమ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల క్రితమే జరిగాయా? దాదాపు 1580 సంవత్సరాల క్రితం ఈ వేడుకలు జరిగినట్టు చూపెడుతున్న ఆధారాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న రెండు పెద్ద గుండ్లపై బుద్ధుడు, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడి శిల్పముద్రలు లభించాయి. క్రీ.శ. 435వ సంవత్సరంలో గోవిందరాజు వర్మ అనే రాజు తన 37వ రాజ్యసంవత్సరంలో రూపొందించిన రాగిశాసనాల ఆధారంగా ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఈ ఆధారాలను వెలికితీశారు. ఈ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడే ఇక్కడ బుద్ధపూర్ణిమ వేడుకలు నిర్వహించారని తెలుస్తోంది.

 - సాక్షి ప్రతినిధి, నల్లగొండ

 

 చరిత్రలోకి వెళితే..




 గోవిందవర్మరాజు తన 37వ రాజ్య సంవత్సరంలో వైశాఖపౌర్ణమి నాడు ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం శివారు)లో 14వ ఆర్యసంఘానికి చెందిన బౌద్ధ మతానుయాయుల సంక్షేమం కోసం అనుయాయుల అధ్యక్షుడు దశబలబలి అనే వ్యక్తికి పేణ్కపల, ఎన్మదల అనే గ్రామాలను దానం చేశాడు. బౌద్ధులుండే అక్కడి పరమమహా విహారాన్ని గోవిందరాజు భార్య పరమ భట్టారికా మహాదేవి నిర్మించారు. ఈ రెండు అంశాలు విష్ణుకుండి రాజుల రాగిశాసనాల్లో పేర్కొనబడి ఉన్నాయి.


 


వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివార్లలోని రాయిపై బుద్ధుడి శిల్పాలు


 


ఈ రెండు శాసనాలను 40 ఏళ్ల క్రితం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి సేకరించారు. ఆ రెండు శాసనాల్లోని మొదటి శాసనంలో పై అంశాలు పేర్కొనబడి ఉన్నాయి. అదే శాసనంలో బౌద్ధవిగ్రహాలకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించినట్టు కూడా ఉంది.

 

 




తుమ్మలగూడెం సమీపంలోని శివాలయం


 


ఇప్పుడేముంది..




 ఈ శాసనాల ఆధారంగా ఇంద్రపాలనగరం, బౌద్ధ విగ్రహాల కోసం డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ పరిశోధన చేశారు. ఆయన పరిశోధనలో అక్కడ బౌద్ధవిగ్రహాలు ఉన్న మాట నిజమేనని, దాదాపు 1580 ఏళ్ల క్రితమే అక్కడ బుద్ధపూర్ణిమ నిర్వహించారని తేలింది. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నుంచి భువనగిరి, వలిగొండ మీదుగా 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే తుమ్మలపల్లి (అప్పటి ఇంద్రపాలనగరం) వస్తుంది. అక్కడి నుంచి ఇప్పటికీ పూజింపబడుతున్న శివాలయాన్ని దాటి శంకర్‌గుట్ట, మూసీ వైపుగా అర ఫర్లాంగు దూరం నడిచిన తర్వాత 30 అడుగుల ఎత్తయిన మూడు గుండ్ల సముదాయం కనిపిస్తుంది. వాటిలో రెండు గుండ్ల మీద 15 అడుగుల ఎత్తున బుద్ధుడు ధ్యానముద్రలో కూర్చున్న శిల్పాలు, బౌద్ధాచార్యుల శిల్పాలు ఉన్నాయి.


 


కాయోత్సర్గ భంగిమ (నిల్చుని)లో ఉన్న ఓ శిల్పం తలపై నాగపడగ ఉంది. ఈయన ప్రముఖ బౌద్ధాచార్యుడు ఆచార్య నాగార్జునుడని తెలుస్తోంది. ఇలాంటిదే మరో లోహ శిల్పం విష్ణుకుండి రాజుల మరో రాజధాని అయిన కీసరగుట్ట సమీపంలో చరిత్రకారుడు జితేందర్‌బాబుకి లభించింది. ఈ శిల్పాలు ఉత్తరభారతదేశంలోని సారనాథ్‌లో లభించిన శిల్పాలను పోలి ఉన్నాయి. తుమ్మలపల్లిలో లభించిన శిల్పాల్లో మరో బౌద్ధాచార్యుడు దిగ్నాగుని శిల్పం కూడా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడే దశబలబలి శిల్పం కూడా ఉంది. ఈ ధ్యానబౌద్ధులు, ఆచార్యుల శిల్పాలు తుమ్మలపల్లిలోనే ఉన్న పంచేశ్వరాలయం దాటాక గుట్ట ప్రారంభపు పైభాగంలో కూడా చెక్కబడడం గమనార్హం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top