మున్సి‘పోల్స్’? | Palvanca, Manuguru Municipalities elections | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్’?

Mar 31 2016 12:43 AM | Updated on Oct 16 2018 7:36 PM

త్వరలో పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: త్వరలో పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు ఈ రెండింటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ప్రభుత్వం కూడా గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై చర్చ సాగుతోంది. 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేస్తూ గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎన్నికలు జరుగుతారుు.
 
 ఎన్నికలు ఎందుకు జరగలేదంటే..
 ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామపంచాయతీ పరిధిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికలు జరపాలంటే  పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వర్తింపచేయాలని పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోవడంతో ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు.
 
 ఈ అంశం పార్లమెంట్ పరిధిలో ఉండటంతో  ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు జిల్లాలోని పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. పాల్వంచ మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగి ఆ తర్వాత నిలిచిపోయాయి. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడంపై కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు జరగలేదు.
 
 మణుగూరుకు ఒక్కసారీ ఎన్నికలు లేవు..
 మణుగూరు పంచాయతీని 2005లో మే 31న థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన సమయంలో పంచాయతీలో 20 వార్డులు, 26వేల మంది జనాభా ఉంది. అయితే అప్పట్లోనే ఏజెన్సీ పరిధిలోని పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేస్తే పన్నులు పెరుగుతాయని గిరిజన సంఘాల నేతలు బండారు నాగేశ్వరరావు, వట్టం రాంబాబులతోపాటు భద్రాచలం పట్టణానికి చెందిన యాసం రాజులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియర్ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ పరిస్థితులతో ఒక్కసారి కూడా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం మణుగూరు మున్సిపాలిటీ జనాభా 23 డివిజన్లలో 42 వేలు ఉంది.
 
  సింగరేణి నిర్వాసిత ప్రాంతాలైన ఎగ్గడిగూడెం, మల్లేపల్లి, పద్మగూడెం, కొమ్ముగూడెం గ్రామాలు ఖాళీ కావడంతో రెండు డివిజన్లు లేకుండా పోయాయి. అదే విధంగా  అన్నారం, చినరాయిగూడెం, కమలాపురం గ్రామాలను మున్సిపాలిటీ నుంచి  తొలగిం చాలని ఆప్రాంతాల ప్రజలు సైతం కోరుతున్నారు. ఈగ్రామాలు తొలగించి సమితిసింగారంలోని పట్టణ ప్రాంతాన్ని మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
 
 చాలా కాలం తర్వాత తెరపైకి..
 పాల్వంచకు 16 ఏళ్లు, మణుగూరుకు 11 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదనే వాదనలున్నాయి. అయితే ఏజెన్సీ చట్టాల ప్రకారం ఆస్తి పన్ను, ఇతర పన్నులపై వివాదం కొనసాగుతోంది.  ఏజెన్సీలోని మున్సిపాలిటీలను 50 శాతం రిజర్వేషన్లతోపాటు చైర్మన్ పదవులను కూడా ఎస్టీలకు కేటాయించాలనే డిమాండ్‌లున్నాయి.
 
 ఇదంతా పార్లమెంట్ పరిధిలో ఉండటంతో చట్ట సవరణ జరగడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో ఎన్నికల సంఘం చొరవ తీసుకుని వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఈ దిశగా ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసింది. దీంతో ఈ మున్సిపాలిటీల ఎన్నికలకు మార్గం సుగమమవుతుందా..? లేదా మళ్లీ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తారా..? అని జిల్లావ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేచింది.
 
 పాల్వంచ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో పాల్వంచ మున్సిపాలిటీని రద్దు చేయలేక, మున్సిపల్ పాలక వర్గ ఎన్నికలు నిలిపివేశారు. అసలు షెడ్యూల్డ్ ఏరియాని మున్సిపల్ ఏరియాగా మార్చే వీలు లేకున్నా అప్పటి పాలకులు, అధికారులు పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తున్న పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని 1987 ఫిబ్రవ రిలో పాల్వంచ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు.  అదే ఏడాది మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవీ కాలం అనంతరం మూడేళ్లపాటు ఎన్నికలు నిలిపివేశారు. తిరిగి 1995 మార్చిలో ఎన్నికలు జరగగా, ఆ కౌన్సిల్ 2000 వరకు కొనసాగింది. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో ఎన్నికలు లేకుండా నిలిచిపోయాయి. తొలిసారి పాల్వంచ ఎన్నికలు జరిగినప్పుడు జనాభా 25వేలు ఉండగా.. ప్రస్తుతం 24 వార్డులు.. 80వేలకు జనాభా చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement