‘సాక్షి’, సుశ్రుత ప్రజావైద్యశాల ఆధ్వర్యంలో వైద్యశిబిరం

In Order To Avoid Diabetes,Need To Change The Lifestyle - Sakshi

మంచి ఆహారం, వ్యాయామం, మందులతో మదుమేహం దూరం

45 ఏళ్లు దాటిన వారందరూ పరీక్షలు చేసుకోవాలి

‘సాక్షి’, సుశ్రుత ప్రజావైద్యశాల ఆధ్వర్యంలో మదుమేహ వైద్యశిబిరం

పాలమూరు మహబూబ్‌నగర్‌ : మారుతున్న మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల వదుమేహం(షుగర్‌) వ్యాధి సోకుతుందని జనరల్‌ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ వాసు చైతన్య అన్నారు. సుశ్రుత ప్రజావైద్యశాల, ‘సాక్షి’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సుశ్రుత ఆస్పత్రిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఓపీ, బీపీ, రక్తపరీక్షలు చేశారు. అంతకుముందు డాక్టర్‌ వాసు చైతన్య మధుమేహం ఎలా వస్తుంది.. ఎలా అదుపు చేసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..  అనే అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రస్తుత పరిస్థితిలో చాలా చిన్న వయసులో షుగర్‌ వస్తోందని, పాఠశాలల్లో చదువు పట్ల ఒత్తిడికి లోను కావడం వల్ల కూడా చక్కెరను నియంత్రించే హార్మోన్లు కొంత కాలానికి పని చేయకుండా పోతాయని, ఈ కారణంగా కూడా వ్యాధి వస్తుందన్నారు.

ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తుందని, ఈ క్రమంలో రక్తంలో గ్లూకోజ్‌ లెవల్‌ పెరిగితే షుగర్‌ వ్యాధి సోకినట్లు గుర్తిస్తామన్నారు. అదేవిధంగా గ్లూకోజ్‌ ఇన్సులిన్‌ హార్మోన్‌ తక్కువగా ఉన్నా, ఇన్సులిన్‌ సక్రమంగా పని చేయకపోయినా వ్యాధి వచ్చినట్లేనన్నారు.  

పెరుగుతున్న వ్యాధిగ్రసులు 

లక్ష మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులకు అతి చిన్న వయసులో ఈ వ్యాధి వస్తున్నట్లు సర్వేల్లో తేలిందని, పెద్దవారిలో 100 మందిలో 50 మందికి షుగర్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కన్పించవని అయిన వారికి ఆ వ్యాధి ఉంటుందని, మరో 50 మందికి లక్షణాలు పస్పుటంగా కన్పిస్తాయని తెలిపారు.  

ఇవీ.. లక్షణాలు

షుగర్‌ వచ్చిన వారికి ఆకలి ఎక్కువగా కావడం, మూత్రం అధికంగా రావడం, కాళ్లు చేతులు తి మ్మిర్లు రావడం, దాహాం వేయడం, శరీరానికి అయిన గాయాలు మానకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.

45ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఓ సారి వై ద్యుడి దగ్గర అన్ని రకాల పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 20నుంచి 30ఏళ్ల వారు ప్రతి ఆరు నెలలకు పరీక్షలు చేసుకోవాలన్నారు.

ముందుజాగ్రత్తలే మేలు

వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తులు అర్హత కల్గిన వైద్యుడి దగ్గరికి మాత్రమే వెళ్లాలని వాసు చైతన్య సూచించారు. షుగర్‌ కంట్రోల్‌లో ఉండాలంటే సరైన పౌష్టికాహారం, వ్యాయామం, డాక్టర్‌ ఇచ్చిన మందులు సక్రమంగా వాడటం వంటివి చేయాలన్నారు. రోజుకు ఆహారం ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని, బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటే చాలా మేలన్నారు.

రాబోయో కాలంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే బీపీ, షుగర్‌ అదుపులో పెట్టుకోవాలని లేకపోతే కిడ్నిలు, గుండెనొప్పి, బ్రెయిన్‌ స్ట్రోక్‌ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. శిబిరంలో డాక్టర్‌ వేణు, పీఆర్‌ఓ  కమల్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top