సమ్మెట పోటు | Officers Made Alternate Arrangements Due to the RTC Strike in Nizamabad District | Sakshi
Sakshi News home page

సమ్మెట పోటు

Oct 6 2019 8:24 AM | Updated on Oct 6 2019 8:24 AM

Officers Made Alternate Arrangements Due to the RTC Strike in Nizamabad District - Sakshi

కామారెడ్డిలో డిపోకే పరిమితమైన బస్సులు

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలో ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏ సీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ప్రైవేట్‌ వాహనాల నిర్వాహకులు విచ్చలవిడిగా దోచుకున్నారు.   

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ డిపోలుండగా, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మ, దస రా పండగలకు సొంతూళ్లకు వెళ్లే వారు గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాశారు. మరోవైపు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్లలో 144 సెక్షన్‌ విధించారు. పోలీసు బందోబస్తు నడుమ కొన్ని బస్సులను తాత్కాలిక డ్రైవర్ల సాయంతో నడిపించారు. కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.  

డిపోకే పరిమితం.. 
ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కామారెడ్డి డిపోలోని 132 బస్సులు ఉదయం నుంచి డిపో బయటకు రాలేదు. 14 ఆర్టీసీ, 05 అద్దె బస్సులను ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించారు. మిగతా బస్సులు డిపోల్లోనే ఉండి పోయాయి. బస్సులు లేక బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారింది. ఇక, బాన్సువాడ డిపోలో 85 బస్సులు ఉండ గా, శనివారం 24 బస్సులను నడిపించారు. ఇవి కూడా రద్దీ అధికంగా ఉన్న బిచ్కుంద, బీర్కూర్, నిజామాబాద్‌ మార్గాలకే ఈ బస్సులను పరిమితం చేశారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో రెండు డిపోలకు కలిపి సుమారు రూ.18 లక్షల వరకు ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఇక నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో రూ.80 లక్షల ఆదాయానికి గండి పడింది.  

‘దారి’ దోపిడీ.. 
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏమో కానీ ప్రైవేట్‌ వాహనాలకు కాసుల పంట పండింది. ప్రైవేట్‌ వాహనాల నిర్వాహకులు విచ్చలవిడిగా దోచుకున్నారు. ఆర్టీసీ టికెట్‌ కంటే రెండింతలు అధికంగా ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. ఆటోలు, టాక్సీలు, మినీ బస్సులు, ప్రైవేట్, స్కూల్‌ బస్సులను బస్టాండ్‌ ఆవరణలో నిలిపి ప్రయాణికులను తరలించారు. సమ్మెను ఆసరా చేసుకుని భారీగా దోపిడీ చేసుకున్నారు. టిక్కెట్లు లేకుండా బస్సులు నడిపారు. టికెట్లు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేశారు. 

పోలీసు పహారాలో బస్టాండ్లు.. 
కామారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో కామారెడ్డి బస్టాండ్‌లో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. కార్మిక నాయకులు డిపో ఎదుట ధర్నాకు యత్నించడం, ఆర్టీసీ వాహనాలను కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు గట్టిగా హెచ్చరించారు. 144 సెక్షన్‌ అమలులో ఉందని ధర్నాలు, నినాదాలు చేయవద్దని సూచించారు. బస్సులు అడ్డుకునేందుకు యత్నించిన వారిని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు బస్టాండ్లు, డిపోల వద్ద బందోబస్తు నిర్వహించారు. 

సమ్మెకు మద్దతు.. 
సమ్మెకు కాంగ్రెస్, సీఐటీయూ, ఎంసీపీఐయూ, సీపీఎం, టీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, కామారెడ్డి జేఏసీ తదితర సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగన్న, సిద్దిరాములు తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

తరలివచ్చిన నిరుద్యోగులు.. 
సమ్మె నేపథ్యంలో తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించేందుకు శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. డిపో ఆవరణలో డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేశారు.

ఆ భృతి మాకు ఇవ్వొచ్చు కదా..! 
కార్మికులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో పాటు సంస్థను నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే మేం సమ్మెకు దిగాం. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందనే భావిస్తున్నాం. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లకు రూ.1500, కండక్టర్లకు రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. ఆ స్థాయిలో మాకు జీతాలు ఇచ్చినా చాలు. సంతోషంగా పని చేస్తాం. – బస్వంత్, టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement