తొలి అంకం ముగిసింది.. | Nominations Are Ended | Sakshi
Sakshi News home page

తొలి అంకం ముగిసింది..

Nov 20 2018 1:58 PM | Updated on Nov 20 2018 1:58 PM

Nominations Are Ended - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం):  అసెంబ్లీ ఎన్నికల్లోని ముఖ్యమైన ఘట్టాలలో తొలి అంకం నామినేషన్ల దాఖలు సోమవారంతో ముగిసింది. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలో గడువు ముగిసే సమయానికి 146 నామినేషన్లు దాఖలయ్యాయి. గత సోమవారం(12వ తేదీన) ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నాటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఉంది. సోమవారం మంచిరోజు కావడం.. ముహూర్త బలం ఉందనే కారణంతో అభ్యర్థులు తమ నామినేషన్లను ముహూర్త సమయానికి దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ తరఫున పాలేరు నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యాహ్నం 1.40 గంటలకు ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.అంతకుముందు ఆయన తరఫున పార్టీ నేతలు మూడు సెట్లు నామినేషన్‌ దాఖలు చేయగా.. నాలుగో సెట్‌ను ముహూర్త సమయానికి అందజేసి.. రిటర్నింగ్‌ అధికారి ముందు ప్రతిజ్ఞ తీసుకున్నారు.

అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మహాకూటమి తరఫున ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సరిగ్గా 2.14 గంటలకు నామినేషన్‌ వేశారు. ఇక పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి, ఖమ్మం నియోజకవర్గం బీఎల్‌పీ అభ్యర్థిగా పాల్వంచ రామారావు నామినేషన్‌ దాఖలు చేయగా.. డమ్మీ అభ్యర్థిగా సీపీఎం తరఫున యర్రా శ్రీకాంత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 

వైరా నుంచి మహాకూటమి అభ్యర్థి సీపీఐకి చెందిన గుగులోతు విజయబాయి, మహాకూటమి తిరుగుబాటు అభ్యర్థిగా బాణోతు రాములునాయక్‌ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే భద్రాచలం మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున పొదెం వీరయ్య నామినేషన్‌ వేయగా.. పినపాక శివసేన అభ్యర్థిగా పాయం పోతయ్య, భారతీయ బహుజన క్రాంతిదళ్‌ పార్టీ అభ్యర్థిగా గుగులోతు విజయ, స్వతంత్ర అభ్యర్థులుగా కొమరం రాంగోపాల్, చవలం అరుణ్, సీపీఎం డమ్మీ అభ్యర్థిగా కుంజా కృష్ణకుమారి, బీఎస్పీ అభ్యర్థిగా కేతావత్‌ స్వప్న నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే గోండ్‌వాన గణతంత్ర పార్టీ అభ్యర్థిగా తుమ్మా నాగరాజు నామినేషన్‌ వేశారు.
 
ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ ఆశించిన వారిలో అనేక మంది ఆశావహులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ అధికార అభ్యర్థిగా బాణోతు హరిప్రియ నామినేషన్‌ దాఖలు చేయగా.. ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన దళ్‌సింగ్, చీమల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, బాణోతు కిషన్, మంగీలాల్‌నాయక్‌ తదితరులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు నామినేషన్‌ దాఖలు చేస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగినా.. కాంగ్రెస్‌ అధిష్టానం వారికి నచ్చజెప్పడంతో వారు నామినేషన్‌ దాఖలు చేయలేదు.కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన నామా నాగేశ్వరరావుకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మాజీ ఎమ్మెల్యే యూనిస్‌ సుల్తాన్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్‌ తదితరులు హాజరయ్యారు.
 
అశ్వారావుపేటలో మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒక్కరోజే 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పల శారద సోమవారం మరోసెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పక్షాలు భారీ ఎత్తున ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement