పైసా విదల్చలేదు !

No money to Govt Hotels from the government in the last three months - Sakshi

గత మూడు నెలల నుంచి పైసా విదల్చని ప్రభుత్వం 

వసతిగృహాల బకాయిలు రూ.వంద కోట్లు 

నిధులివ్వకుంటే నిర్వహించలేమని స్పష్టీకరణ 

సాక్షి,హైదరాబాద్‌: సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతి గృహాలు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. నెలవారీ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వాటి నిర్వహణ గందరగోళంగా మారింది. నిధుల లేమితో హాస్టళ్లను నిర్వహించలేమని వసతిగృహ సంక్షేమాధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు 1,956 వసతిగృహాల్లో దాదాపు 2లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతిగృహాల్లో వీరికి ఉదయం పాలు, స్నాక్స్‌తో పాటు సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్నం మాత్రం పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటారు.

ఈమేరకు ప్రభుత్వం నెలవారీగా వసతిగృహ సంక్షేమాధికారులకు నిధులు విడుదల చేస్తుంది. సాధారణంగా ఈ హాస్టళ్లకు ముందస్తు నిధులు కాకుండా నెల గడిచిన తర్వాత నిధులివ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి హాస్టల్‌కు కావాల్సిన సరుకులను అరువుపై తెచ్చి నిర్వహిస్తున్నారు. నెల గడిచిన వెంటనే బిల్లులు సమర్పిస్తే...ఆమేరకు ప్రభుత్వం నిధులిచ్చేది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నిధుల సమస్యతో హాస్టళ్లు సతమతమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లకు తొలి మూడు నెలలు అరకొరగా నిధులు విడుదలైనప్పటికీ...బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లకు మాత్రం ఇప్పటివరకూ పైసా అందకపోవడంతో ఆయా వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పేరుకుపోయిన బకాయిలు
బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలకు నిలిచిపోయిన నిధులకు సంబంధించి మెస్‌చార్జీలే అధికంగా ఉన్నాయి. విద్యుత్‌ చార్జీలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, తదితర నిర్వహణకు సంబంధించిన బిల్లులు కూడా పెడింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిలు దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్లు సంక్షేమాధికారులు అంచనా వేస్తున్నారు. కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో షాపు యాజమానులు సరుకులు నిలిపివేస్తున్నారని సంక్షేమాధికారులు చెబుతున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వడాన్ని నిలిపివేశారని మేడ్చల్‌ జిల్లాకు చెందిన వసతిగృహ సంక్షేమాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top