ఉన్నది ఒక్కటే గది..కానీ బడులు మూడు

No Infrastructure Facilities For Harijan Government School In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ విద్యాలయాల్లోనే పిల్లలను చేర్పించండి అన్నీ సదుపాయాలు అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. అన్నింటికీ మించి నాణ్యమైన విద్యను అందించేలా ముందుకు సాగుతున్నాం. ఇవి నిత్యం విద్యాశాఖ అధికారులు చెప్పే మాటలు. విద్యార్థులు తీరా పాఠశాలల్లో చేరిన తర్వాత వారు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉంటుంది అక్కడి పరిస్థితి. దీంతో పిల్లలు నిరుత్సాహపడుతున్నారు.

సర్కారు బడులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు అందిస్తూ వస్తోంది. ఇంత వరకు బాగున్నా పాఠశాలల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.ఇరుకైన గదుల్లో విద్యాబోధన.. ఒకే భవనంలో మూడు పాఠశాలలు.. ఒకే తరగతి గదిలో ఐదేసీ తరగతుల నిర్వహణ కొనసాగిస్తున్నారు. పైన చెప్పిన సమస్యలతో పాటు ఎమ్మార్సీ కార్యాలయాన్ని కూడా మోస్తున్న జిల్లా కేంద్రంలోని హరిజనవాడ పాఠశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...  

ఒకే భవనంలో మూడు పాఠశాలలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌కు ఆనుకొని హరిజనవాడ పాఠశాలను ఏర్పాటు చేశారు. అక్కడ నాలుగు తరగతి గదులు నిర్మించారు. మొదట్లో ముగ్గురు టీచర్లతో బాగానే బోధన జరిగినప్పటికీ, క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం 56మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లతో పాఠశాల సాగుతుంది. ఐదు తరగతులకు ఒకే గది కేటాయించారు.  ఇరుకుగా ఉన్న సర్దుకుపోవాల్సిన పరిస్థితిలో విద్యార్థులు ఆగమవుతున్నారు.

ఇస్లాంపుర, తదితర ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో ఉండేం దుకు ఏర్పాటు చేసిన రాళ్లపేట్‌ రోడ్‌లోని స్టేషన్‌రోడ్‌ పాఠశాలను భవన యాజమాని ఖాళీ చేయించటంతో మొదట్లో ఓ ఉపాధ్యాయుని ఇంట్లో రేకుల షెడ్డులోకి మార్చారు. కానీ అక్కడ రెండేళ్ల కిందట గ్యాస్‌ లీకేజీ అయి  విద్యార్థులకు తృటిలో ప్రాణప్రా యం తప్పింది. దీంతో అధికారులు హుటాహుటిన స్టేషన్‌ రోడ్‌ పాఠశాలలను హరిజనవాడ పాఠశాలకు తరలించి  ఓ గది కేటాయించి చేతులు దులుపుకున్నారు.  

తర్వాత కాలంలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అదే ప్రాంతంలో మౌళిక సదుపాయాలతో కూడిన పాఠశాల భవనం ఏర్పాటు చేయాల్సిన ఊసేలేకుండా పోయింది. ఈ పాఠశాలలో 31 మంది విద్యార్థులుండగా రెగ్యులర్‌ టీచర్‌తో పాటు వీవీతో నెట్టుకొస్తున్నారు. స్టేషన్‌రోడ్‌ స్కూల్‌లో జరిగిన గ్యాస్‌ లీకేజ్‌ సంఘటన సాకుగా చూపి  రాళ్లపేట్‌లోని ఓ ప్రైవేట్‌ భవనంలో ఉన్న రాళ్లపేట్‌ పాఠశాలను ఇక్కడకు తరలించి, ఆ పాఠశాలకు ఓ గదిని కేటాయించారు. ఇలా ఒక్కో గదిని ఒక్కో పాఠశాలకు కేటాయించారు. ఈ పాఠశాలలో 23 మంది విద్యార్థులు చదువుతుండగా ఉపాధ్యాయుడితో పాటు వీవీలతో విద్యాబోధన సాగుతుంది. ఇటీవల ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయాన్ని కూడా ఇక్కడికే తరలించటంతో అసలు సమస్య మొదలైంది. 

ఎంఈవో కార్యాలయం తరలింపుతో
ఇది వరకు మంచిర్యాల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలోనే ఎంపీడీవోతో పాటు మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్‌ మండలాలకు చెందిన ఎంఈవో కార్యాలయం కార్యకలాపాలు కొనసాగుతుండేవి. మంచిర్యాల మండల ప్రజాపరిషత్‌ భవనాన్ని జిల్లా పరిషత్‌ కార్యాలయానికి కేటాయించటంతో హాజీపూర్‌లో నూతనంగా నిర్మించిన భవనానికి మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని తరలించారు. మిగిలిన ఎంఈవో కార్యాలయాన్ని సమీపంలోని హరిజనవాడ పాఠశాల పై అంతస్తు భవనంలోకి మార్చారు.

కార్యాలయంలో విధులు నిర్వహించే సీసీవో దివ్యాంగుడు కావటంతో భవనం పైకి మొట్లు ఎక్కి దిగాలంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.   మంచిర్యాలలో క్లర్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆఫరేటర్‌ (సీసీవో) తో పాటు మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫార్మమేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌)తో అటెండర్‌ను నియమించాల్సి ఉండగా సీసీవో ఒక్కడే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఐదు స్కూల్‌ కాంప్లెక్ల్‌లుండగా ఇద్దరు సీఆర్‌పీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ఐదేళ్ల కిందట పాత మంచిర్యాలలో ఎంఈవో కార్యాలయానికి స్థలం కేటాయించిన నిధుల లేమితో ఫిల్లర్‌ వరకు సాగిన  నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే మంచిర్యాల, హాజీపూర్, నస్పూర్‌ మూడు మండలాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే యూనిఫామ్‌లు కూడా ఎమ్మార్సీకి చేరాయి.

విద్యార్థులకు దూరభారం
విద్యార్థులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలోనే సర్కారు పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అధికారుల ఆనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. వెనక ముందు ఆలోచించకుండా అన్నింటినీ ఒకే చోటుకి తరలించారే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవటం విద్యార్థులకు ఆర్థిక భారంగా మారుతుంది.

స్టేషన్‌రోడ్‌ పాఠశాల, రాళ్లపేట్‌ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు రావటానికి ఆటోలు ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు దింపి వెళ్తున్నారు. మరికొందరు నడిచి వస్తూ విద్యనభ్యసిస్తున్నారు. ఆటోలు వచ్చి వెళ్లటానికి దాదాపుగా నెలకు దూరాన్ని బట్టి రూ. 300 నుంచి రూ. 700 వరకు ఖర్చు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top