డాక్టరమ్మ.. లేదమ్మా!

No Gynecologist Available In Nagarkurnool District Hospital - Sakshi

జిల్లా కేంద్రాస్పత్రిలో ఎప్పుడు అడిగినా ఇదే మాట

పురిటి నొప్పులతో వచ్చి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగు

గైనకాలజిస్ట్‌ లేక గర్భిణులు, బాలింతల అవస్థలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రాస్పత్రిలో గైనకాలజిస్ట్‌ లేక గర్భిణులు, బాలింతలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతకాలం ఇక్కడ ప్రాక్టీస్‌ చేయడానికి ఇద్దరు గైనకాలజిస్ట్‌లు బదిలీపై వచ్చారు. కోర్సు ముగియడంతో వారికి కేటాయించిన  స్థానాలకు వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు కొత్తవారిని నియమించకపోవడంతో ఆ ప్రభావం గర్భిణులపై పడుతోంది. పురిటినొప్పులతో కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చినవారికి నర్సులే దిక్కవుతున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆస్పత్రులను మార్చాయలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే 102 అంబులెన్స్, కేసీఆర్‌ కిట్‌ను తీసుకొచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను విడతల వారీగా ఇవ్వడంతో సామాన్యులు సైతం ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి వస్తున్నారు. ఈ కారణంగా ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టు ఏరియా ఆస్పత్రిని జి ల్లా ఆస్పత్రిగా మార్చినా దానికి అనుగుణంగా వై ద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ వి ఫలమైంది. దీనికి కారణాలేమైనా గర్భిణులు పు రిటి నొప్పులతో వచ్చి గైనకాలజిస్టు లేదని తెలిసి ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.   

కార్పొరేట్‌ వైద్యం ఎక్కడా?
ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరుగుతాయని ఆశించి ప్రతినెలా చెకప్‌లు చేయించుకోవడానికి సైతం సర్కారు దవాఖానాలకే వస్తున్నారు పేదలు, సామాన్యులు. సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా గైనకాలజిస్టులు, అనస్థీషియన్, పీడియాట్రిస్ట్‌లు, స్టాఫ్‌నర్స్‌లను నియమించక పోవడంతో కొర్పొరేట్‌ వైద్యం సరికదా సాదాసీదా వైద్యం కూడా అందడంలేదు. కంటి తుడుపు చర్యగా రోజుకు రెండు, మూడు చొప్పున ప్రసవాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బుధవారం నుంచి కోర్సుపై పనిచేస్తున్న గైనకాలజిస్ట్‌లు సైతం వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రి మొత్తానికి గైనకాలజిస్ట్‌ లేకుండా పోయారు.  

అన్నింటా ఇదే సమస్య
జిల్లా ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లోనూ వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఎక్కడ చూసినా వైద్యులు లేక ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సైతం ఇన్‌చార్జి అధికారే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేందుకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ గైనకాలజిస్ట్‌పై ఆధారపడి ఉండటంతో అవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రితో పాటు 178 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఏఎన్‌ఎంలు 88 మంది ఉండగా, 16 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. సెకండ్‌ ఏఎన్‌ఎంలు 178 మంది ఉండాల్సి ఉండగా 162 మంది ఉన్నారు. వారితోపాటు యురోపియన్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేసే ఏఎన్‌ఎంలు 39మందికి 25మందే ఉన్నారు. అలాగే 944 మంది ఆశా కార్యకర్తలు అవసరం కాగా 921 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా డీఎంహెచ్‌ఓ పరిధిలో 62మంది ఎంబీబీఎస్‌ వైద్యులకు గానూ 48 మంది ఉండగా వీరిలో 12మంది కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. మరో 14 ఖాళీలు ఉన్నాయి. ఫార్మాసిస్టులు 31మందికి గానూ 19మంది రెగ్యులర్, ఆరుగురు కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. నలుగురు డెంటల్‌ వైద్యులు ఉన్నారు.  

ఇవీ చేయాల్సినవి..  

  • ప్రతి పీహెచ్‌సీలో ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలి.  
  • ప్రతి సీహెచ్‌సీలో ఒక మత్తు డాక్టర్‌తో పాటు ఇద్దరు చొప్పున డీజీఓ (స్త్రీల వైద్య నిపుణులు) అవసరం. అలాగే ఇద్దరు మత్తు డాక్టర్లు, నలుగురు డీజీఓలు ఉండాలి.  
  • ప్రతీ సీహెచ్‌సీ కేంద్రాల్లో చిన్నపిల్లల వైద్యులు ఒకరు అవసరం.  
  • ముఖ్యంగా డీఎంహెచ్‌ఓ పోస్టు రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమిస్తే ప్రజలకు వైద్య సేవలు చేరువవుతాయి.  
  • జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సులు 20మంది ఉండాలి. హెడ్‌ నర్సులు ముగ్గురు ఉండాలి. అన్ని విభాగాల్లో కనీసం 9 మంది వైద్యులు, ఐదుగురు సర్జన్లు, మత్తు వైద్యుడు ఉండాలి.

ప్రతిపాదనలు పంపించాం  
జిల్లా ఆస్పత్రిలోని సమస్యలు, పరిష్కారాలపై ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను పంపాం. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు, డయాలసిస్‌ కేంద్రాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఇదే స్థాయిలో గర్భిణులకు సైతం నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించనున్నాం. ప్రస్తుతం గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా ఓ డాక్టర్‌ను నియమించాం. త్వరలోనే గైనకాలజిస్ట్‌ పోస్టులు భర్తీ చేయిస్తాం.     
– డాక్టర్‌ రాకేష్‌చంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top