
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో ప్రతీ పౌరుడిపై రూ. 88 వేలు అప్పుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ కోసం రూ. 50 వేల కోట్లు వృధా చేశారని, ఆ నీళ్లతో జనాలు బట్టలు ఉతుకుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లు రావనే భయంతోనే కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ప్రతిపాదనలు పంపలేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అన్న కేసీఆర్ ఇప్పటివరకూ ఎందుకు నీళ్లను ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మరోవైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీళ్లను తరలిస్తే నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నేతలు మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, భూపతి రెడ్డి, గడుగు గంగాధర్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.