nizamabad dcc
-
ఆ నీళ్లతో ప్రజలు బట్టలు ఉతుకుతున్నారు!
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో ప్రతీ పౌరుడిపై రూ. 88 వేలు అప్పుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ కోసం రూ. 50 వేల కోట్లు వృధా చేశారని, ఆ నీళ్లతో జనాలు బట్టలు ఉతుకుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లు రావనే భయంతోనే కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ప్రతిపాదనలు పంపలేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అన్న కేసీఆర్ ఇప్పటివరకూ ఎందుకు నీళ్లను ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మరోవైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీళ్లను తరలిస్తే నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నేతలు మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, భూపతి రెడ్డి, గడుగు గంగాధర్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లేయలేదు... నోట్లిచ్చేయండి!
బిడ్డ చచ్చినా పురిటికంపు పోలేదన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా కాంగ్రెస్‌లో లొల్లి ఆగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఆర్థిక లావాదేవీల పంచాయితీ ఊపందుకుంటున్నది. స్థానిక సంస్థల కోటాలో ఇటీవల పూర్తయిన శాసనమండలి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన పంచాయితీకి తెరలేపుతున్నది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థిగా వెంకటరమణా రెడ్డిని ప్రకటించడానికి ముందుగానే 2 కోట్ల రూపాయలను పార్టీ డిపాజిట్ చేసుకున్నట్టుగా సమాచారం. నామినేషన్లు పూర్తయిన తర్వాత వెంకటరమణా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని, టీఆర్ఎస్లో చేరిపోయారు. దీనితో కాంగ్రెస్‌కు చెందిన ఓటర్లు(జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు) నిరాశ చెందకుండా ఉండటానికి అభ్యర్థి డిపాజిట్ చేసిన 2 కోట్లను ఖర్చుచేయాలని జిల్లా నేతలు నిర్ణయించారు. అయితే అభ్యర్థి నుంచి 70 లక్షలు మాత్రమే వచ్చాయని, మిగిలిన 1.30 కోట్లు తన దగ్గరకు రాలేదని ఆ జిల్లాకు చెందిన మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి తప్పించుకుంటున్నారని ఆ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. డిపాజిట్ చేసిన ప్రకారం 2 కోట్ల రూపాయలను ఓటర్లకు పంచాల్సిందేనని ఆ జిల్లాకు చెందిన నేతలు పట్టుబడుతున్నారట. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొందరు ఓటర్లు ఎన్నికలకు మూడు నాలుగు రోజులకు ముందుగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిపోయారట. అప్పటికే వారికి అందాల్సిన మొత్తం ముట్టిందట. కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకుని టీఆర్ఎస్లో చేరిన వారి దగ్గరకు... కాంగ్రెస్ అభ్యర్థులకు చెందిన అనుచరులు వెళ్లి డబ్బులు వాపస్ అడుగుతున్నారట. ఓట్లు వేస్తారని డబ్బులు ఇచ్చామని, అవి తీసుకుని టీఆర్ఎస్లో చేరినందున తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఇలాంటి పంచాయితీలు మరికొన్ని టీపీసీసీ దృష్టికి రావడంతో ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు.