‘నాగేశ్వరి’ మృతి కళా లోకానికి తీరని లోటు


హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి వెంపటి నాగేశ్వరి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు పాడై నెలరోజులుగా బాధప డుతున్న ఆమెకు గుండెపోటు రావడంతో మరణించారు. తన జీవితాన్నంతా నాట్యశిక్షణకే వెచ్చించారు. నాగేశ్వరికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్, జనప్రియ గానసభ కార్యదర్శి నర్సింహారావు, సంగీత ఉపాధ్యాయులు వద్దిరాజు నివేదిత తదితరులు నివాళుల ర్పిం చారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవడం ఓరుగల్లు కళా లోకానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు.

 

నేపథ్యం..

 

నాగేశ్వరి ఓరుగల్లుకు చెందిన సాంప్రదాయ కుటుంబంలో 1957 అక్టోబర్ 24న జన్మించారు. జిల్లాకు కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేయడంతోపాటు 43 సంవత్సరాల పాటు సేవలందించి నాట్య కళాకారిణులకు స్ఫూర్తిగా నిలి చారు. ఆమె తండ్రి కోదండరామశాస్త్రి, తాత వెంపటి వెంకటనారాయణ కూచిపూడి త్రిమూర్తులలో ఒక్కరు. తాతగారి పేరిట నాగేశ్వరి 1979లో వరంగల్‌లో శ్రీవెంపటి వెంకటనారాయణ కాకతీయ నృత్యకళాక్షేత్రాన్ని స్థాపించారు.



నాట్యాచార్యులలో ఆధ్యులు, ప్రముఖ నాట్యాచార్యులైన ఉమావైజయంతిమాల, భ్రమరాంబ, గీత, రాజ్యలక్ష్మి తది తర కూచిపూడి కళాకారిణులు నాగేశ్వరి వద్ద నేర్చుకున్న విద్యార్థులే. ఇంకా అనేకమంది శిష్యులున్నారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. విద్యారణ్యపురి ప్రభుత్వ నృత్యసంగీత కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ, బాలభవన్ ప్రిన్సిపాల్ ఝూన్సీ, నృత్యస్రవంతి బాధ్యురాలు తాడూరి రేణుక తదితరులు నాగేశ్వరి వద్ద శిక్షణ పొందిన వారే. వెంపటి నాగేశ్వరి భక్తప్రహ్లద, గంగాగౌరి సంవాదం, భక్తశిరియాల వంటి అనేక నృత్యనాటికలకు దర్శకత్వం వహించారు. ఇవి దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.

 

 నాగేశ్వరి పేరిట అవార్డు ఏర్పాటు చేయాలి

 వెంపటి నాగేశ్వరి నాకు గురువు. ఆమె ఆకస్మిక మరణం జిల్లా సాంస్కృతిక రంగానికి తీరని లోటు. వెంపటి నాగేశ్వరి పేరిట జిల్లాలో అవార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

 - కుప్పా పద్మజ, ప్రిన్సిపాల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాల

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top