అందరి బడి | my aim is common school for all, says kcr | Sakshi
Sakshi News home page

అందరి బడి

Jul 27 2014 1:47 AM | Updated on Jul 11 2019 5:07 PM

అందరి బడి - Sakshi

అందరి బడి

స్థాయీభేదం లేకుండా అన్ని వర్గాలు ఒకచోట చదువుకునే కామన్ స్కూల్ విధానం(నైబర్‌హుడ్ స్కూలింగ్) నాకున్న పెద్ద కల... ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమల్లోకి తీసుకువద్దాం’ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మనసులోని మాటను బయటపెట్టారు.

కామన్ స్కూల్ విధానం నా కల : కేసీఆర్
 తెలంగాణలో అమలు చేద్దాం...
 ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సీఎం కేసీఆర్
 ఏకీకృత సర్వీసు రూల్స్‌పై త్వరలో ఉన్నత స్థాయి భేటీ
 కేజీ టు పీజీ విస్తరణకు 12 ఏళ్లు
 
 సాక్షి, హైదరాబాద్:‘స్థాయీభేదం లేకుండా అన్ని వర్గాలు ఒకచోట చదువుకునే కామన్ స్కూల్ విధానం(నైబర్‌హుడ్ స్కూలింగ్) నాకున్న పెద్ద కల... ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమల్లోకి తీసుకువద్దాం’ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మనసులోని మాటను బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుని కొడుకు కూడా ఆ దేశంలోని కామన్ స్కూల్‌లోనే చదువుతాడని, తెలంగాణలో ఆ పరిస్థితిని తీసుకురావాలన్నదే తన లక్ష్యమని శనివారం తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సీఎం పేర్కొన్నారు.  ఏకీకృత సర్వీసు రూల్స్, ఇతర సమస్యలపై 16 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ను కలిశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర పీఆర్‌సీనే అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పీఆర్‌సీ వల్ల ఉద్యోగులకు నష్టమేనని పేర్కొన్నారు.
 
 టీచర్లను పదోన్నతులపై లెక్చరర్లుగా నియమించే ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యారంగం ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో విద్యాభివృద్ధికి తీసుకురావాల్సిన మార్పులపై  గంటపాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ విద్యారంగంపై తన లక్ష్యాన్ని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్‌లలో దేశాధినేత కొడుకైనా కామన్ స్కూల్ విధానంలో చదువుకోవాల్సి ఉంటుంది. అలాంటి విద్యా విధానం తెలంగాణలో అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీసు నిబంధనలు అమలు కోసం ఏకీకృత సర్వీసు రూల్స్ తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని, దీనిపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
 12 ఏళ్లలో పూర్తి రూపు!
 
 పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన నిర్ణయాలను వారం పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. అంతకంటే ముందుగా ఉపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇతర విద్యావేత్తలతోనూ సమావేశం నిర్వహించి సలహాలు తీసుకుంటామన్నారు. కేజీ టూ పీజీ విద్యావిధానం ఒకేసారి కాకుండా ఒకటో తరగతి నుంచి ప్రారంభించి క్రమంగా 12వ తరగతి వరకు పెంచుకుంటూ పోతామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు ఈ ప్రత్యే క పాఠశాలలు నడుస్తాయని, 12 ఏళ్ల తరువాత కేజీ టూ పీజీ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని చెప్పారు. అంగన్‌వాడీ స్కూళ్లను ప్లేస్కూల్స్‌గా మార్చే ఆలోచన ఉందన్నారు.
 
 ధర్మబద్ధంగా పనిచేయాలి
 
 ప్రభుత్వం ఇప్పటివరకు అనుసరించిన అడ్డగోలు విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి మార్పులు రావాలని,  ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలు సర్కారు బడికి బాట పట్టే వాతావరణం తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయుల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే వారు తమ గురుతర బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, ఏఐటీఓ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడి ్డ, సాయిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, భుజంగరావు, సమ్మయ్య, మల్లయ్య, ధమణేశ్వర్‌రావు, సోమేశ్వర్‌రావు, మల్ల్లికార్జున్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement