బోధన్‌ స్కాం దర్యాప్తులో కదలిక | Motion in Bodhan scam investigation | Sakshi
Sakshi News home page

బోధన్‌ స్కాం దర్యాప్తులో కదలిక

Nov 24 2017 1:18 AM | Updated on Nov 24 2017 1:18 AM

Motion in Bodhan scam investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఖజానాకు రూ.450 కోట్లకు పైగా గండికొట్టిన బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. గతంలో ఇద్దరు ప్రధాన సూత్రధారులతో పాటు 9 మంది వాణిజ్య పన్నుల అధికారులను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ, తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కేసును పెద్దగా పట్టించుకోలేదు. తీరా  దర్యాప్తు మధ్యలో ఆగిపోయిన కేసులు, చివర దశలో ఉన్న కేసులను తేల్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో బోధన్‌ స్కాంలో రెండో విడత దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న శివరాజ్‌కు పరిచయం ఉన్న మరికొంత మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై దర్యాప్తు వేగవంతం చేసినట్టు సీఐడీలోని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో అరెస్టయిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బెయిల్‌పై బయటకు వచ్చి ఎవరెవరితో కేసు గురించి చర్చించారు? ఎక్కడెక్కడ తిరిగారు? ప్రస్తుతం వారి సంగతేంటన్న అంశాలపై రెండు దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్టు తెలిసింది. బోధన్‌ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న మరికొంతమంది వాణిజ్య పన్నుల శాఖ అధికారుల జాబితాను సైతం సీఐడీ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా 16మంది అధికారులపై విచారణకు సమాయత్తం అవుతున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. దీనితో పాటు స్కాంలో 3,465 నకిలీ చలాన్లు గుర్తించగా, స్కాం జరగడానికి నాలుగేళ్ల ముందు నుంచి కట్టిన చలాన్లను సైతం క్రాస్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల కేవలం వాణిజ్య పన్నుల శాఖ అధికారులే కాకుండా ట్రెజరీ విభాగం అధికారులు, బ్యాంకు అధికారుల పాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు ఆరు నెలల తర్వాత కేసులో మళ్లీ కదలిక రావడంతో స్కాంలో పాత్రధారులుగా ఉన్న అధికారుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement