లక్షకుపైగా వాహనాలు!

More than a lakh vehicles to meeting - Sakshi

ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 10 వేల చొప్పున వాహనాలు

ఆర్టీసీకి రూ.10 కోట్ల ఆదాయం!

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 2న నిర్వహించే ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.  సభకు 25 లక్షల మందికిపైగా జనాన్ని తరలించాలని టీఆర్‌ఎస్‌ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వాహనాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 10 వేలకు పైగా వాహనాలు సభకు వస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ నుంచి 7 వేలకు పైగా వాహనాలు అడిగారని అధికారులు చెబుతున్నారు. వీటి బుకింగ్‌లు పూర్తి కావొచ్చాయి. ఆర్టీసీకి రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

టోల్‌గేట్ల వద్ద అదనపు సిబ్బంది..
రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులన్నింటిపై కలిపి దాదాపు 17 టోల్‌గేట్లు ఉన్నాయి.  ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలున్నాయని బుధవారం ‘టోల్‌’ ఫికర్‌ పేరిట ప్రచురితమైన కథనం నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఇక్కడ ట్రాఫిక్‌ నియంత్రణకు అదనపు సిబ్బందిని నియమించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. జాతీయ రహ దారులపై ఉన్న టోల్‌గేట్ల వద్ద ఈ వాహనాలు టోల్‌ చెల్లించే విషయంలో స్పష్టత రాలేదు.

డీజిల్‌కు పెరిగిన డిమాండ్‌..
సభకు అన్ని జిల్లాల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో పెట్రోల్‌ బంకుల యజమానులు అప్రమత్తమయ్యారు. శనివా రం సాయంత్రం, ఆదివారం వాహనాలు బారులు తీరనున్న నేపథ్యంలో  ఇంధనాన్ని అదనంగా తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.  25 లక్షల మందిని తరలించేందుకు లక్ష వాహనాలు అవసరం. ఈ వాహనాలకు లక్ష మంది డ్రైవర్లు అవసరం. మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వారి అనుచరులు మరో 2 వేల వాహనాల్లో రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సభకు వచ్చే వారిలో లక్షకు పైగా డ్రైవర్లు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.

ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వం...
ప్రగతి నివేదన సభకు భారీగా టీఎస్‌ ఆర్టీసీ బస్సులు తరలించనున్న నేపథ్యంలో సామా న్యులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వమని చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మాట్లాడుతూ బస్సులకు అద్దె చెల్లించే విషయంలో ఎవరికీ   మినహాయింపులు ఇవ్వడం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top