గుబులు..

MLAs Sentiment To Win Second Term In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  సాధారణ ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే జరుగుతాయనే ప్రచారంతో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్‌లతో మొదలుకుని.. విపక్షంలో ఉన్న అందరూ ఎన్నికలపైనే దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ సాధించడమే కాకుండా ఎలాగైనా గెలిచి తీరాలని తహతహలాడుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలను సెంటిమెంట్‌ పట్టి పీడిస్తోంది. వరుస ఎన్నికల్లో పోటీ చేసిన వారికి చేదు ఫలితాలు ఎదురయ్యే ఆనవాయితీ ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో కనీసం పార్టీ తరఫున టికెట్టు దక్కని పరిస్థితులు సైతం ఉన్నాయి. ఇంకొందరైతే రాజకీయంగా పలుకుబడినే కోల్పోవడం గమనార్హం.

2014 సాధారణ ఎన్నికల్లో ఎనిమిది మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారం అనుభవించిన, అనుభవిస్తున్న నేతలకు ఈ సెంటిమెంట్‌ భయం పట్టుకుంది. వరుస విజయం సాధించడం ద్వారా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్న నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్‌ను అధిగమించి చరిత్రను తిరగరాయాలని ఆయా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తుండడంతో కాళ్లకు చక్రాలు కట్టుకు ని మరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీరోజూ నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు.  
 

గత ఎన్నికల్లో ముగ్గురే.. 
రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యం కలిగిన పాలమూరు ప్రాంతంలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయి. ప్రతీ నేత ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుంటారు. అలా అభ్యర్థుల వ్యూహాలను బట్టి గెలుపోటములు దక్కుతున్నాయి. అయితే చాలా వరకు ఉమ్మడి జిల్లాలో వరుసగా విజయకేతనం ఎగురవేసిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా గెలిచిన వారు కేవలం ముగ్గురంటే ముగ్గురే ఎన్నికవడం గమనార్హం. వీరిలో కొల్లాపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే.అరుణ, కొడంగల్‌ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి మాత్రమే వరుస విజయాలు సాధించారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో మిగతా ఎనిమిది మంది మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.  

ఆ నియోజకవర్గాల చరిత్ర అంతేనా.. 
ఉమ్మడి జిల్లాలో ‘సెకండ్‌ సెంటిమెంట్‌’ పట్టి పీడిస్తున్న నియోజకవర్గాలు అర డజనుకు పైగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒకసారి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖాలు లేవు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి గడిచిన ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా వరుసగా రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. 1994లో ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆతర్వాత 1999 ఎన్నికల్లో జైపాల్‌యాదవ్‌ గెలుపొందారు. అనంతరం 2004లో ఎడ్మ కిష్టారెడ్డి గెలుపొందగా, 2009లో జైపాల్‌యాదవ్‌ గెలిచారు. ఇక 2014లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసిన వంశీచంద్‌రెడ్డి అనూహ్యంగా గెలుపొందారు.

అచ్చంపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో.. రాష్ట్రంలో అదే పార్టీ పరిపాలనలోకి వస్తుందనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఇక వనపర్తి నియోజకవర్గంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వనపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఏ ఒక్క అభ్యర్థి వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖాలు లేవు. కేవలం 1999తో పాటు 2004లో వరుసగా రెండు సార్లు మాత్రమే చిన్నారెడ్డి గెలవగలిగారు. అలాగే వనపర్తి నుంచి పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఒక్క 2004లో మినహా సదరు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో అదో సెంటిమెంట్‌గా మారింది. 

చరిత్ర తిరగరాసే యోచన.. 
రాజకీయంగా పాలమూరు ప్రాంతాన్ని వెంటాడుతున్న ‘సెకండ్‌ సెంటిమెంట్‌ను ఈసారి ఎట్టి పరిస్థితిల్లో తిరగరాస్తామనే ధీమా పలువురు ఎమ్మె ల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఎన్న డూ లేని విధంగా మొదటి సారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏకంగా ఎనిమిది మంది ఉండగా వారి లో చాలా మంది సులువుగా ప్రజల్లో కలిసిపోయా రు. అంతేకాదు మొదటిసారి గెలుపొందడంతో ఎమ్మెల్యేలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితం గా గెలుస్తామని ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్‌ పునావృతం అవుతుందా.. లే æదా చరిత్రను తిరగరాస్తారా అనేది వేచిచూడాల్సిందే.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top