మిస్‌ఫైర్‌పై కొనసాగుతున్న విచారణ | misfire investigation is in process | Sakshi
Sakshi News home page

మిస్‌ఫైర్‌పై కొనసాగుతున్న విచారణ

Oct 22 2014 2:33 AM | Updated on Sep 2 2017 3:13 PM

పట్టణంలోని మయూరి ఇన్‌లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : పట్టణంలోని మయూరి ఇన్‌లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రాయికల్ ఎస్సై రాములునాయక్‌ను మంగళవారం స్థానిక పోలీసులు విచారించినట్లు సమాచారం. సోమవారం ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు డీఎస్పీ మాధవరెడ్డి, రూరల్ సీఐ రఘు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా లాడ్జిలోని 212 గదిని పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలడిగి తెలుసుకున్నారు. సోమవారం సేకరించిన ఆధారాల ప్రకారం మంగళవారం విచారణ కొనసాగించారు. అప్పటికే రాములునాయక్‌పై సెక్షన్ 286, 337 కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సై విచారణలో దోషిగా తేలితే చట్టపరమైన చర్యలతోపాటు శాఖ పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.
 
విధి నిర్వహణలో నిర్లక్ష్యం...!
కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములునాయక్ జిల్లా దాటి నిర్మల్‌కు రావడం, కుంటాల జలపాతంలో విందు చేసుకోవడం.. పైగా దీనికి అధికారికంగా సెలవు తీసుకోకుండా రావడం ఆయన విధినిర్వహణపై ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది. ఆది నుంచి దూకుడు స్వభావంతో పనిచేసే ఎస్సైగా రాములునాయక్‌కు పేరుందని సమాచారం. విధి నిర్వహణలో భాగంగా అత్యవసర సమయంలో ఉపయోగించే సర్వీస్ రివాల్వర్ రెండు రౌండ్లు పేల్చడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే రివాల్వర్ నుంచి ఒక్క తూటా బయటపడిన అనంతరం అప్రమత్తమై మరోరౌండ్ తూటా పేలకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ వెనువెంటనే తుపాకీ నుంచి రెండు బుల్లెట్లు రావడం పలు సందేహాలకు తావిస్తోంది.
 
సెటిల్‌మెంట్ కోసమేనా..?
రాయికల్ ఎస్సై అసలు నిర్మల్‌కు ఎందుకు వచ్చినట్లు..? కరీంనగర్ జిల్లా ఎంఈవోలతో కలిసి కుం టాల జలపాతానికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణం లో నిర్మల్‌లో ఎందుకు ఆగారు..? ఆయనకు నిర్మల్ డివిజన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీర్డీలు లాడ్జీలో విం దు ఎందుకు ఏర్పాటుచేశారు..? వీరి కలయిక వెనక సెటిల్‌మెంట్ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..! అ నేది పట్టణంలో చర్చనీయాంశమైంది. నిర్మల్ డివి జన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కొందరు ఎ న్నికల కంటే ముందు కరీంనగర్ జిల్లాలో పనిచేయడంతో ఎస్సైతో సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ బంధం ఏమైనా ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చిందా..? అయితే.. ఒకే గదిలో ఉద్యోగులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎస్సై రివాల్వర్ పేలడం ప్రమాదవశాత్తు జరిగింది కాదేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వేటు పడే అవకాశం? : ఎస్సై రివాల్వర్ తూటాలు ఉపయోగిస్తే ఎందుకు, ఎప్పుడు వినియోగించారన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన లెక్కచూపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఎస్సైపై వేటువేసేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement