ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!

Minister KTR Signature Forgery Becoming Big Issue In Government offices - Sakshi

ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కోఆర్డినేటర్‌ పోస్టు కోసం మంగళ సృష్టించిన ఫోర్జరీ లేఖ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఆమెకు సంబంధించి ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఆమెను ఈ పోస్టులో కొనసాగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టరేట్‌ కార్యాలయం నుంచి జిల్లావిద్యాశాఖకు అందిన లేఖ కూడా ఫోర్జరీదేనని తెలుస్తోంది. 

సాక్షి, నల్లగొండ : ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో ఆర్డినేటర్‌గా కొనసాగేందుకు ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించిన నకిలీ రికమెండేషన్‌ లేఖ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై శుక్రవారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన ‘పోస్టింగ్‌ కోసం .. ఫోర్జరీ’ ప్రత్యేక కథనం సంచలనం రేపింది. జిల్లా ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రావులపెంట జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎం.మంగళను ఓపెన్స్‌ స్కూల్స్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులో కొనసాగించేందుకు అధికారికంగా జరిగిన ‘కరస్పాండెన్సు’కు సంబంధించిన ఫైళ్లను కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెప్పించుకున్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారిని పిలిపించి మాట్లాడాలని కలెక్టర్‌ ప్రయత్నించినా, కోర్టు కేసు విషయంలో డీఈఓ సరోజీనిదేవి హైదరాబాద్‌ వెళ్లడంతో కుదరలేదు. అదే మాదిరిగా, స్థానిక వన్‌ టౌన్‌ సీఐ సురేష్‌ సైతం డీఈఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు తీసుకోవడానికి ప్రయత్నించినా, డీఈఓ లేని కారణంగా వీలుపడలేదు. జిల్లా నిఘా విభాగం అధికారులు సైతం మంత్రి కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 

పరీక్షల నిర్వహణలో అవినీతి..?
మరోవైపు జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ నిర్వహణతోపాటు, పరీక్షల నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఓపెన్స్‌ స్కూల్స్‌ సొసైటీ అధికారులతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారులకూ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరి పితే మరిన్ని నిజాలు బయట పడతాయని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. 

సస్పెండ్‌ చేయాలి : డీటీఎఫ్‌
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ మంగళను సస్పెండ్‌ చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖుర్షీద్‌మియా, ప్రధాన కార్యదర్శి వెంకులు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ కె.వీరయ్య శుక్రవారం ప్రకటనలో కోరారు. విద్యాశాఖ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయమైందని, అక్రమ డిప్యుటేషన్లు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీటిపై కూడా విచారణ చేసి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

డీఈఓపై చర్యలు  తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ పోస్టింగ్‌ విషయంలో మంత్రి కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమెండేషన్‌ లెటర్‌ సృష్టించిన మంగళపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ లేఖను సరైన విధంగా పరిశీలించని విద్యాశాఖాధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్‌ అధికారులను ఒక ప్రకటనలో కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top