దుక్నం తెరవలె! | Sakshi
Sakshi News home page

దుక్నం తెరవలె!

Published Fri, Feb 21 2020 10:08 AM

Merchants Back to Rent in Model Market Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న నానుడిని తలపిస్తున్నాయి మోడల్‌ మార్కెట్ల తీరు. నిర్మాణానికి నోచుకున్నా వినియోగంలో లేకుండాపోవడంతో ఉసూరుమంటున్నాయి. కోట్లాది రూపాయల వ్యయం చేసినా ఆశించిన ఫలితం చేకూరడంలేదు. గ్రేటర్‌ నగరంలో పదివేల మందికి ఒక మార్కెట్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో తొలిదశలో 200 మోడల్‌ మార్కెట్లను నిర్మించాలనుకున్నారు. ఇందుకు దాదాపు రూ.130 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకు 38 మార్కెట్లను నిర్మించారు. కానీ.. వీటిని వినియోగంలోకి తెచ్చారా.. అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అంటే అదేం లేదు. లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తయిన దాదాపు పది మార్కెట్లలో సైతం అన్ని దుకాణాలు వినియోగంలోకి రాలేదు. ఇవి ప్రజలకు ఉపకరించడం లేదు. 

ఆది నుంచీ ఆటంకాలే..
మోడల్‌ మార్కెట్ల కేటాయింపుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నా అద్దె ధరలు ఎక్కువగా ఉన్నాయని చాలా మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేరు. ఎస్సీ, ఎస్టీలు, స్వయం సహాయక మహిళా బృందాలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లున్నా చాలా చోట్ల కేటాయింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

అద్దెల నిర్ణయించారిలా..
మోడల్‌ మార్కెట్‌ నిర్మించిన ప్రాంతంలోని స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ, మార్కెట్‌ నిర్మాణానికి చేసిన ఖర్చులో 15శాతం అద్దె వచ్చేలా ఏడాదికి అద్దె ధరలు నిర్ణయించారు. ఉదాహరణకు  స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ, మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ ఖర్చు వెరసీ మొత్తం రూ.3 లక్షలైతే, సదరు మార్కెట్‌ ద్వారా ఏటా రూ.3 లక్షల అద్దె వచ్చేలా వాటిల్లోని దుకాణాల విస్తీర్ణాన్ని బట్టి అద్దెలు  నిర్ణయించారు. అలా నిర్ణయించిన కనీస ధరకన్నా ఎక్కువ ఉంటే వేలం ద్వారా  కేటాయిస్తున్నారు. ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే విషయాన్ని వివరిస్తూ అద్దె ధర తగ్గించేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించగా, 15 శాతం స్థానే 10 శాతానికి తగ్గిస్తూ జీఓ జారీ చేసి కూడా దాదాపు రెండేళ్లయింది. అయినప్పటికీ.. దుకాణాలు నిర్వహించేందుకు వ్యాపారుల నుంచి స్పందన కనిపించడం లేదు.  
అధికారుల అశ్రద్ధ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కేటాయించిందీ స్వల్పమే..
ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తయిన  38 మార్కెట్లలోని 571 షాపులకుగాను కేవలం 121 షాపులకే అద్దె ఒప్పందాలు పూర్తయ్యాయి. మిగతా 450 దుకాణాలకు కేటాయింపులే పూర్తికాలేదు. తాజా కూరగాయల్ని ప్రజలకు అందించే ‘మన కూరగాయలు’ కోసం కూడా  మోడల్‌ మార్కెట్లలో ఒక దుకాణాన్ని కేటాయిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

సికింద్రాబాద్‌ జోన్‌ శాంతినగర్‌లోని మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తవడంతోపాటు అందులోని17 దుకాణాలకు వేలం జరగ్గా 7 దుకాణాలకు లీజు అగ్రిమెంట్‌ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. ఇలాంటి పరిస్థితే దాదాపుగా మెజారిటీ  మోడల్‌ మార్కెట్లలో నెలకొంది.
అల్వాల్‌ సర్కిల్‌లోని రైల్‌నగర్, కౌకూర్‌లలోని రెండు మోడల్‌ మార్కెట్లలో ఒక్కోదాంట్లో 15 దుకాణాలకు ఐదు పర్యాయాలు వేలంపాటలు నిర్వహించినా ఎవరూ ముందుకు రాలేదు.
మల్కాజిగిరి సర్కిల్‌లో 16 దుకాణాలకు పదిసార్లు టెండర్లు పిలిచినా నిర్వహణకు ఎవరూ రాలేదు.  
ఎల్‌బీనగర్‌ సరూర్‌నగర్‌లోని మోడల్‌ మార్కెట్‌లోని 15 దుకాణాలకు వేలం పూర్తయినా డిపాజిట్ల చెల్లింపులు జరగలేదు. అగ్రిమెంట్లు పూర్తికాలేదు. సంతోష్‌నగర్‌లోని నిర్మాణం పూర్తయిన 21 దుకాణాల్లో ఐదింటికి వేలం పూర్తయినా అగ్రిమెంట్లు కాలేదు.  
అన్ని మోడల్‌ మార్కెట్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.  

అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..
ఇటీవల ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ వివరించాక జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ అధికారులు తదితరులు నేరుగా వెళ్లి  గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌ను, అందులోని వివిధ  దుకాణాలను సందర్శించి అద్భుతమని కీర్తించారు. నగరంలో మోడల్‌ మార్కెట్లు పూర్తయినా.. దుకాణాలు, వ్యాపారాలు లేక.. ప్రజలు రాక వెలవెలబోతున్నాయి.  
సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో అన్ని రకాల దుకాణాలతో, సకల హంగులతో అభివృద్ధి పరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

Advertisement
 
Advertisement