బతికించేవారే.. బతకలేక..

MBBS Students Are Attempt To Suicide In Telangana - Sakshi

సమస్యలతో సతమతమై ప్రాణాలు తీసుకుంటున్న యువ డాక్టర్లు

ఉద్యోగం రాక.. అప్పులు తీర్చలేక..

కుటుంబానికి భారమనే భావనతో అఘాయిత్యం

15 గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్నవారు

40,000మంది దాకా వైద్య నిరుద్యోగులు

ఎంబీబీఎస్‌ అంటే చాలామందికి పెద్ద కల..

జనాలచేత దేవుడిలా పిలిపించుకునే ఆ వృత్తి పట్ల విపరీతమైన మక్కువ.. చిన్నప్పుడే ఎవరైనా నువ్వు ఏం అవుతావని అడిగితే డాక్టర్‌ అని చెప్పేవారే ఎక్కువ.. అలాంటిది ఇప్పుడు ఎంబీబీఎస్‌ చదివినవారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లక్షలు పోసి ఎంబీబీఎస్‌ చదివినా.. పీజీ సీటు రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఫలితంగా పెళ్లి కూడా కాకపోవడం.. మరోవైపు కన్నవాళ్లకు భారమయ్యామనే ఆవేదనలో కూరుకుపోతున్నారు. దీంతో ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సినవారు.. చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన హర్షకుమార్‌.. 2017లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యా యుడు కావడంతో ఎలాగైనా తన కొడుకును డాక్టర్‌గా చూడాలనుకొని హర్షకుమార్‌ను అప్పట్లో రూ.40 లక్షలు అప్పు చేసి మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో చేర్పించాడు. ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత పీజీ సీటు రావడం గగనంగా మారింది. దీంతో అప్పులు, వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. పైసా సంపాదన లేదు. దీంతో తండ్రికి భారంగా మారాననే భావనతో హర్షకుమార్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు మెడికల్‌ షాపు ఉంది. కొడుకు సంజయ్‌కుమార్‌ను డాక్టర్‌గా చూడాలనుకుని మేనేజ్‌మెంట్‌ కోటా కింద రూ.50 లక్షలతో ఓ ప్రముఖ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేయించాడు. 2016లో ఎంబీబీఎస్‌ పూర్తయింది. ఆ తర్వాత సంజయ్‌కుమార్‌ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ క్లినికల్‌ సబ్జెక్టులో సీటు రాలేదు. పైగా తండ్రి అప్పు చేసి చదివించడం, 30 ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి కాకపోవడంతో గతేడాది ఆ యువ వైద్యుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌బాబు వరంగల్‌ జిల్లాలో వ్యవసాయం చేస్తాడు. మధ్య తరగతి కుటుంబం. కొడుకు అరవింద్‌ తెలివైన విద్యార్థి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్‌ కోటా కింద సీటు వచ్చింది. ఫీజు తక్కువే కావడంతో కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడింది. ఎంతో ఉత్సాహంగా అరవింద్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. తర్వాత మెడికల్‌ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. పెళ్లి కూడా కాలేదు. దీంతో అవమాన భారం భరించలేక తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లిన అరవింద్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

పీజీ సీట్లు చాలా తక్కువ..
రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు 1,600 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో క్లినికల్‌ సీట్లు వెయ్యి వరకే ఉన్నాయి. మిగిలినవి నాన్‌ క్లినికల్‌ సీట్లు. వీటిల్లో ఎవరూ చేరరు. దీంతో వాటిల్లోని అనేక సీట్లు మిగిలిపోతాయి. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులు మరో వెయ్యికి పైగా ఉంటారు. అంటే ఏడాదికి రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసే వారు 6 వేల మంది ఉంటారు. ఎంబీబీఎస్‌ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మాత్రం ఆరో వంతే ఉన్నాయి. దీంతో ఏటా ఎంబీబీఎస్‌ చదివిన వారికి పీజీలో సీటు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. ఎంబీబీఎస్‌తో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సరైన జీతం లభించట్లేదు. వైద్య నిరుద్యోగులు రాష్టంలో పేరుకుపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దాదాపు 40 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నారని అంచనా. దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నాయి. వాటి కోసం ఈ ఏడాది నీట్‌ పరీక్షకు ఏకంగా 1.4 లక్షల మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు హాజరయ్యారు. పీజీ స్పెషలైజేషన్‌ లేకపోతే సొంత క్లినిక్‌ పెట్టుకోవడానికి, కార్పొరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అవకాశం ఉండదు. పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రూ.15 నుంచి రూ.20 వేల జీతమే ఇస్తారు. 

డిప్రెషన్‌లోకి..
పీజీ సీటు రాకపోవడం, ఎంబీబీఎస్‌ చదువు దేనికీ పనికిరాకపోవడంతో యువ వైద్యులు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్‌ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వారు అక్కడ ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని మన దేశంలో ఎగ్జిట్‌ అర్హత పరీక్ష పాస్‌ కావడమే గగనంగా మారింది. 2015–2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 61,500 మంది ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష రాశారు. వీరిలో 8,700 మంది మాత్రమే పాసయ్యారు. అంటే కేవలం 14.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎగ్జిట్‌ పరీక్ష పాసైన వారిలో పీజీ సీటు పొందేవారు 5 శాతం కూడా ఉండట్లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి.

స్తోమత లేకున్నా చదివిస్తున్నారు..
కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమత సహకరించకున్నా వైద్య విద్యపై పిచ్చితో పిల్లలను ఎంబీబీఎస్‌ చదివిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ సీటుకు రూ.కోటి వరకు పెట్టి చదివించే పరిస్థితి నెలకొంది. భూమి అమ్మడం లేదా అప్పులు చేయడం ద్వారా తమ పిల్లలను చదివిస్తున్నారు. గతంలో ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఏడాది వాయిదా ఉండటంతో మొదటి ఏడాది ఎలాగోలా చెల్లించి.. రెండో ఏడాది చూద్దాంలే అని చదివిస్తున్నారు. కానీ రెండో సంవత్సరం వచ్చే సరికి ఫీజు చెల్లింపు తలకు మించిన భారం అవుతోంది. తెచ్చిన అప్పుల భారం పెరిగిపోతోంది. కొందరైతే చివరి రెండు వాయిదాలు చెల్లించలేక మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. పీజీ కోసం రెండు మూడేళ్లుగా కోచింగ్‌ తీసుకునే వారెందరో ఉన్నారు. కోచింగ్‌ ఫీజులు, ఖర్చులు భారంగా మారుతున్నాయి. చివరకు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో డిప్రెషన్‌కు లోనవుతున్నారు.

కలలు కల్లలవుతున్నాయి: డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులకు పీజీ సీట్లు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు స్తోమతకు మించి అప్పులు చేసి మేనేజ్‌మెంట్‌ సీట్లలో చేర్పించడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్‌లో చేశాక, పీజీ మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు కొనడం అంటే సాధారణ మధ్య తరగతి వారికి అసాధ్యం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని గమనించాలి. అప్పులు చేయడం సరికాదు.

పీజీ రాకుంటే డిప్రెషన్‌లోకి: డాక్టర్‌ విజయేందర్, జూడాల నేత
వేలాది మంది అప్పులు చేసి ఎంబీబీఎస్‌ చదివిన వారు తర్వాత పీజీ రాక డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. కార్పొరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వట్లేదు. బయట క్లినిక్‌ పెట్టుకునే అవకాశాల్లేవు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావట్లేదు. ఇవన్నీ కలిపి యువ వైద్యులను తీవ్ర డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలనూ నింపట్లేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top