ప్రాణం తీసిన పూడిక బావి

Man Accidentally Fell Into Well - Sakshi

పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి యువ రైతు మృతి

గట్లనర్సింగపూర్‌లో విషాదం

భీమదేవరపల్లి(హుస్నాబాద్‌) : ఎండిపోతున్న మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు తాపత్రయపడిన యువరైతు తన వ్యవసాయ బావి పూడికతీసేందుకు ఉపక్రమించాడు. దురదృష్టావశాత్తు వ్యవసాయ బావిలోనుంచి క్రేన్‌ సాయంతో పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌కు గ్రామానికి చెందిన బొల్లంపల్లి రాకేష్‌(30) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గట్లనర్సింగపూర్‌కు చెందిన బొల్లంపల్లి యోహోన్, కొంరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కలదు. పెద్ద కుమారుడైన రాకేష్‌ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తున్నాడు.

వీరికున్న ఎకరం వ్యవసాయ భూమిలో వర్షకాలంలో పత్తి పంట సాగు చేస్తే దిగుబడి రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చె సమయంలోనే వ్యవసాయ బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పంట వల్లుమోహం పట్టింది. దీంతో పంటను రక్షించుకునేందుకు గత రెండు రోజుల క్రితమే క్రేన్‌ సాయంతో తండ్రి యోహోన్, కుమారుడు రాకేష్‌తో పాటుగా కూలీలతో వ్యవసాయ బావిలో పూటీకతీత పనులు చేపట్టారు. కాగా బుధవారం బావిలోని విద్యుత్‌ మోటర్‌ పనిచేయకపోవడంతో మోటర్‌ను పైకి తీసేందుకు రాకేష్‌ బావిలోకి దిగాడు.  

క్రేన్‌ వైర్‌ మోటర్‌కు అమర్చి మోటర్‌పై రాకేష్‌ కూర్చుండి పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రాకేష్‌ బావిలో పడగా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మారిన రాకేష్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని సర్పంచ్‌ సల్పాల రాధికతిరుపతితో పాటు పలువురు సందర్శించి నివాలులర్పించారు. కాగా రాకేష్‌ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్యాల ప్రకాశ్, అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి షడ్రక్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top