ఉద్యోగం కాదు.. ఉపాధి కల్పించేలా..

 వ్యవసాయ డిగ్రీ సిలబస్‌లో కీలక మార్పులు 

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ శ్రీకారం 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ డిగ్రీ సిలబస్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులు 4 నెలలపాటు రైతుల వద్ద శిక్షణ పొందేలా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) ఐదో డీన్స్‌ కమిటీ రూపొందించిన సిలబస్‌ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యను అభ్యసించిన విద్యార్థి.. ప్రభుత్వోద్యోగం కోసం కాకుండా ఆదర్శ రైతుగా, వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అవతరించి 10 మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్న ఉద్దేశంతో సిలబస్‌లో మార్పులు చేశామని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే సమయంలో విద్యార్థులకు రూ.3 వేల స్టైఫండ్‌ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

చివరి ఏడాది క్షేత్రస్థాయి శిక్షణే..: నాలుగేళ్ల వ్యవసాయ డిగ్రీ కోర్సులో చివరి ఏడాది పూర్తిగా క్షేత్రస్థాయి శిక్షణకే కేటాయించారు. అందులో నాలుగు నెలలు ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యాక గ్రామాల్లో రైతుల వద్ద విద్యార్థులు శిక్షణ పొందాలి. రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయాలి. రైతుల వాస్తవ జీవన చిత్రాన్ని గుర్తించాలి. రైతుల వద్ద అనుభవం గడించాక మరో 4 నెలలు ఓ వ్యవసాయ సంబంధిత బహుళజాతి కంపెనీ లేదా పేరున్న వ్యవసాయ పరిశ్రమలో పని చేసి అగ్రి బిజినెస్‌లో మెలకువలు నేర్చుకోవాలి.  

హైటెక్‌ అగ్రి కోర్సులు: కన్జర్వేషన్‌ అగ్రికల్చర్, సెకండరీ అగ్రికల్చర్, హైటెక్‌ సాగు, స్పెషాలిటీ అగ్రికల్చర్, రెన్యువబుల్‌ ఎనర్జీ, డ్రైలాండ్‌ హార్టికల్చర్, ఇంట్రడక్టరీ నానో టెక్నాలజీ, ఆగ్రో మెట్రోలజీ అండ్‌ క్‌లైమేట్‌ చేంజ్, ఫుడ్‌ క్వాలిటీ, ఫుడ్‌ స్టోరేజ్‌ ఇంజనీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఐకార్‌ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా కోర్సులను వ్యవసాయ వర్సిటీలు పరిచయం చేయాలని, కొత్త కోర్సులకు అనుగుణంగా బోధన సిబ్బందినీ సిద్ధం చేయాలని కోరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయడం, కొత్త కోర్సులు సిద్ధం చేయడంపైనా ఐదో డీన్స్‌ కమిటీ కసరత్తు చేసింది. ఐదేళ్లకోసారి సిలబస్‌ మార్పు, కొత్త కోర్సుల పరిచయంపై దృష్టి సారించింది. వ్యవసాయంపై ఆసక్తి పెంచేందుకు పదో తరగతి, ఇంటర్‌లోనూ కొన్ని అధ్యాయాలుండాలనే చర్చ జరిగింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top