పాలకుర్తి సోమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా

KCR Election Campaign In Warangal - Sakshi

దేవాదులతో వరంగల్‌ జిల్లా పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే 100 టీఎంసీల నీళ్లు వస్తాయి. లింగంపల్లి ప్రాజెక్ట్‌ పూర్తయితే జనగామ జిల్లాలో నీళ్లకు ఢోకా ఉండదు. ప్రాణం పోయినా అబద్ధాలు చెప్పను. పాలకుర్తి సోమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా. సొంత జాగా ఉన్న వాళ్లకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేస్తా. రైతుబంధు సాయం రాబోయే రోజుల్లో ఎకరానికి .10వేలు ఇస్తాం. పాలకుర్తిని చూస్తే కడుపు నిండినట్లుంది దయాకర్‌రావును నంబర్‌వన్‌ మెజార్టీతో గెలిపించాలి  ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  -కేసీఆర్‌

సాక్షి, జనగామ: ‘త్వరలోనే కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయి. దేవాదులతో ప్రత్యేకంగా వరంగల్‌ జిల్లా పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే 100 టీఎంసీల నీళ్లు వస్తాయి’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లాలోని పాలకుర్తి  నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో సోమవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేసీఆర్‌ మాట్లాడుతూ జిల్లాకు మంత్రి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరిక మేరకు లింగంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.3 వేల కోట్లతో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చామన్నారు. ఆ ప్రాజెక్ట్‌ పూర్తయితే నీళ్లకు ఢోకా ఉండదన్నారు. ఆదాయం పెంచి పేదలకు పంచుతున్నామని, రూ.43 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మీ పథకానికి వరంగల్‌ జిల్లాలోని ములుగులోని ఓ తండాలో అడుగుపడిందని, తన నియోజకవర్గంలోని గజ్వేల్‌లోని ఓ గ్రామంలో జరిగిన సంఘటన కంటి వెలుగుకు కారణమైందన్నారు. పాలకుర్తి సోమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా.. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను సడలిస్తామన్నారు. పాలకుర్తిలోని ప్రజలను చూస్తుంటే తనకు  కడుపు నిండినట్లయిందన్నారు. 

కేసీఆర్‌ ఆశీస్సులతో నీళ్లు, నిధులు తెస్తా..
పాలకుర్తి ప్రజలు నా మంచితనం చూసి రెండుసార్లు గెలిపించారు. మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీ ఇవ్వాలి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పాలకుర్తి, చెన్నూరు, నవా బ్‌పేట రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసి కాల్వల ద్వారా అన్ని సమయాల్లో నీరందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సభా ముఖంగా సీఎంను కోరుతున్నా. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ,జూనియర్‌ కళాశాలలు మంజూరు చేయాలి. తొర్రూరు మునిసిపాలిటీ అభివృద్ధి నిధులు ఇవ్వాలి. పాలకుర్తికి 100 పడకల ఆస్పత్రి మంజూరి చేయాలి. మళ్లీ అధికారంలోకి రాగానే దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పాలకుర్తి, చెన్నూరు, నవాబ్‌పేట రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసి కాల్వల ద్వారా అన్ని సమయాల్లో నీరందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేసీఆర్‌ను కోరుతున్నా. పాలకుర్తి ప్రజలు నా మంచి తనం చూసి రెండు సార్లు గెలిపించారు. మరో సారి ఆశీర్వదించి భారీ మెజార్టీ ఇవ్వాలి. కేసీఆర్‌తో కొట్లాడైనా ఎక్కువ నిధులు తీసుకొచ్చి పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయిస్తా.
ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి

ఎర్రబెల్లి హుషారుగున్నడు.. 
ఎర్రబెల్లి దయాకర్‌రావు చాలా హుషారు ఉన్నాడు. గోదావరి నీళ్ల కోసం వచ్చి చెరువులు నింపాలని అడిగిండు. ఇప్పుడు కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పినా వినలేదు. దయాకర్‌రావును చూస్తుంటే నాకు ఓ కథ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో ఒకరింటికి సుట్టం వచ్చిండ ట. నేను జల్ది పోతా..నేను జల్ది పోతా అంటుంటే ఆ ఇంటి పెద్ద అన్నం కాలే బిడ్డా.. చలి అన్నం ఉన్నది తింటావా అంటే.. ‘ఎందుకవ్వ చలి బువ్వ తింటా.. ఉడుకన్నం అయ్యే వరకు ఉంటా’ అన్నాడట.. అట్ల ఉన్నాడు మన దయాకర్‌రావు. గోదావరి నీళ్ల కోసం నిజామాబాద్‌లో గొడవలు అయితుంటే ఆయన కాల్వలకు నీళ్లు తెచ్చుకుని చెరువులు నింపుకున్నడని గుర్తు చేశారు. 

సమయం లేక మాట్లాడలేక పోతున్నా..
ఈ సభలో గంట సేపు మాట్లాడాలని అకున్నప్పటికీ సమయం లేదు. సరిగ్గా 5.22 గంటలకు హెలీకాప్టర్‌ బయల్దేరాలి. లేదంటే నేను పాలకుర్తిలనే పండుకోవాల్సి ఉంటుందని కేసీఆర్‌ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సభలో పాలకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిప్యూటీ కడియం శ్రీహరి, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్, డాక్టర్‌ సుధాకర్‌రావుతోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

20 నిమిషాల్లోనే..
సాక్షి, జనగామ: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పాల్గొన్న టీఆర్‌ఎస్‌ సభ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. పాలకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు తరఫున ప్రచారం చేయడానికి సోమవారం బస్టాండ్‌ సమీపంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ముందుగా మధ్యాహ్నం 3.30 గంటలకు కేసీ ఆర్‌ సభకు రావాల్సి ఉండగా ఖమ్మం జిల్లా పాలేరులో జరి గిన బహిరంగసభలో పాల్గొని ఆలస్యంగా వచ్చారు. కేసీ ఆర్‌ సాయంత్రం 5గంటలకు వేదికపైకి వచ్చి 5.20 గంటల కు వేదిక దిగి వెళ్లిపోయారు. 20 నిమిషాల్లోనే ముగిసినప్పటికి తన ప్రసంగంతో ప్రజలను ఉత్తేజితులను చేశారు. 

పరిస్థితిపై బాస్‌ ఆరా..
సాక్షి, జనగామ: జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయమై  టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరా తీశారు. వేదికపైకి వచ్చిన సమయంలో ప్రజలకు అభివాదం చేశారు. కూర్చునే సమయంలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణితో మాట్లాడారు. వరంగల్‌ ఈస్ట్‌లో పరిస్థితి ఎలా ఉందని అడిగారు. పార్టీ గెలిచేలా కలిసి పని చేయాలని సూచించారు. దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్ననే కూర్చున్న గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య  చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌తో మాట్లాడారు. సబ్సిడీ గొర్రెలను యాదవులకు ఇచ్చాం కదా.. ప్రచారంలో వాళ్లు పాల్గొంటున్నారా ? లేదా అని అడిగారు. ఓటింగ్‌ ఎలా ఉండబోతుందని ప్రశ్నించగా గొర్రెలు  తీసుకున్న యాదవులు మనకే మద్దతుగా ఉన్నారు సార్‌ అంటూ సమాధానమిచ్చారు. మెజార్టీ యాదవులు మనవైపే ఉన్నారని కేసీఆర్‌కు వివరించారు. గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ గాంధీ నాయక్‌తో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కడియంతోనూ మాట్లాడారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందని, అభ్యర్థుల ప్రచార సరళిపై ఆరా తీశారు. అన్ని  స్థానాలు గెలిచేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. వేదికపై ఉన్న నాయకులతో కేసీఆర్‌ మాట్లాడే దృశ్యాలపై సభికులు ఆసక్తి చూపారు. 

సభ సైడ్‌లైట్స్‌

  •      కేసీఆర్‌ అనుకున్న 3:30 గంటల సమయం కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చారు.
  •      సరిగ్గా 4.45 గంటలకు కేసీఆర్‌ కస్తూర్భా స్కూల్‌ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద హెలీకాప్టర్‌ దిగారు.
  •      4.52 గంటలకు వేదికపైకి వచ్చిన కేసీఆర్‌ 5 గంటలకు ప్రసంగం ప్రారంభించారు.
  •      తిరిగి 5.20 గంటలకు వేదిక నుంచి దిగి నేరుగా హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లిపోయారు. 
  •      పాలకుర్తి బహిరంగ సభకు అనుకున్న జనం కంటే ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. 
  •      ప్రముఖ గాయని మంగ్లీతోపాటు రచ్చ రవి, కాసర్ల శ్యామ్, చమ్మక్‌ చంద్ర సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దే..
పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌: గత నాలుగున్నరేళ్ల పాలనలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. అభివృద్ధికి మారుపేరు దయాకర్‌రావు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని ఆదరిస్తే ప్రశాంతంగా ఉన్న పల్లెలు అశాంతికి నిలయమవుతాయి. రౌడీయిజం, భూకబ్జాలకు పాల్పడిన వ్యక్తులకు  బ్యాలెట్‌ ద్వారా బుద్ధి చెప్పాలి. 
కడియం శ్రీహరి, ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top